Agnipath Scheme: 'అగ్నిపథ్'కు సహకరించని పంజాబ్ అధికార యంత్రాంగం.. రిక్రూట్ మెంట్ ఆపేస్తామన్న సైన్యం

  • పంజాబ్ సీఎస్ కు జోనల్ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ మేజర్ శరద్ బిక్రమ్ సింగ్ లేఖ
  • రిక్రూట్ మెంట్ ర్యాలీకి పోలీసులు, అధికారులు కచ్చితంగా సహకరించాలన్న బిక్రమ్ సింగ్
  • దీన్నుంచి తప్పించుకోవడం కుదరదని వ్యాఖ్య
Indian army expresses unhappiness over Punjab officials not supporting recruitment rally

భారత రక్షణ దళాల్లోకి 'అగ్నిపథ్' పథకం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి యువత నుంచి విశేషమైన స్పందన వచ్చింది. లక్షలాది మంది త్రివిధ దళాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, అభ్యర్థుల ఎంపికకు పంజాబ్ లోని స్థానిక అధికార యంత్రాంగం సహకరించడం లేదని భారత సైన్యం ఆరోపించింది. ఇలాగైతే పంజాబ్ లో రిక్రూట్ మెంట్ ను నిలిపేస్తామని, పొరుగు రాష్ట్రాల్లో నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీకే జంజువాకు జలంధర్ లోని జోనల్ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ మేజర్ జనరల్ శరద్ బిక్రమ్ సింగ్ ఒక లేఖ రాశారు. 

తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని, నిధులు లేవని స్థానిక అధికారులు చెపుతున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. రిక్రూట్ మెంట్ ర్యాలీకి స్థానిక పోలీసులు, అధికారులు కచ్చితంగా సహకరించాల్సిందేనని... దీన్నుంచి తప్పించుకోవడం కుదరదని తెలిపారు. రిక్రూట్ మెంట్ సమయంలో అభ్యర్థులను వరుస క్రమంలో నియంత్రించడం, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, భద్రత కల్పించడం తదితర కార్యకలాపాలకు పోలీసుల సహకారం అవసరమని చెప్పారు. 

టెంట్లు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లతో పాటు సుమారు 4 వేల మందికి 14 రోజుల పాటు ఆహార సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. దీంతోపాటు అభ్యర్థులకు అవసరమైనప్పుడు చికిత్స అందించడానికి వైద్య బృందం, అంబులెన్స్ లు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ అవసరాలను తీర్చే అంశంలో తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని... లేకపోతే ఇండియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేస్తానని... రిక్రూట్ మెంట్ ర్యాలీని నిలిపివేయాలని కోరుతానని తెలిపారు.

More Telugu News