Budda Venkanna: బతికినంత కాలం బాబుతోనే.. పార్టీ మార్పు వార్తలను ఖండించిన బుద్ధా వెంకన్న

Budda Venkanna  clarifies on Party Chnging
  • విజయవాడలో నిర్వహించిన టీడీపీ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు
  • ఫ్లెక్సీపై ఆయన ఫొటో లేకపోవడంతో వేదికపైకి వెళ్లొద్దని వారించిన అనుచరులు
  • కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చేసిన వెంకన్న 
  • అది చూసి పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం
తాను టీడీపీని వీడబోతున్నానంటూ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, తాను బతికి ఉన్నంత వరకు టీడీపీలోనే, చంద్రబాబుతోనే ఉంటానని స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న టీడీపీని వీడబోతున్నారన్న వార్తల వెనక ఓ కారణం కూడా ఉంది. విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. 

అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బుద్ధా వెంకన్న ఫొటో లేకపోవడంతో ఆయన అనుచరులు నొచ్చుకున్నారు. వేదికపైకి వెళ్లొద్దని ఆయనను వారించారు. దీంతో ఆయన కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి బయటకు వచ్చారు. అంతే.. ఆయన టీడీపీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.

ఈ ప్రచారంపై స్పందించిన వెంకన్న.. వాటిని ఖండించారు. అలాంటి ఆలోచనేదీ తనకు లేదని, కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని, చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని చెబుతూ పుకార్లకు చెక్ పెట్టారు.
Budda Venkanna
TDP
Vijayawada
Chandrababu

More Telugu News