Kumaraswamy: కేసీఆర్‌తో ఏం మాట్లాడారో వెల్లడించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

  • హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కుమారస్వామి భేటీ
  • తమ మధ్య తృతీయ కూటమిపై చర్చ జరగలేదన్న కుమారస్వామి
  • రైతుల సమస్యలపై మాట్లాడుకున్నామన్న మాజీ సీఎం
  • కేసీఆర్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టీకరణ
No third front issue discussed says kumaraswamy

జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌ పలు రాష్ట్రాల్లో పర్యటించి ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలను కలిసి ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కుమారస్వామి ఆ తర్వాత బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో భేటీలో తృతీయ కూటమి విషయం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. 

దేశంలోని రైతుల సమస్యలపై మాత్రమే చర్చ జరిగిందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందన్నారు. వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో కేసీఆర్‌కు మాత్రమే తెలుసని అన్నారు. ఆయనకు తాము మద్దతు ఇస్తామన్నారు. దేశ సమస్యలపై ఎవరు గళం విప్పినా సహకరిస్తామన్నారు. దేశంలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఎంతో అవసరమన్న కుమారస్వామి.. ప్రతి ప్రాంతీయ పార్టీ జాతీయ లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

More Telugu News