Jagan: టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష

  • బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ లు
  • 5.18 లక్షల ట్యాబ్ లు అవసరమన్న అధికారులు
  • తరగతి గదుల డిజిటలైజేషన్ పైనా సమీక్ష
  • రూ.512 కోట్లకు పైగా వ్యయం
CM Jagan reviews on Tabs distribution to 8th class students and teachers

రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్ లు ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఇవాళ సమీక్ష జరిపారు. మొత్తం 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్యాబ్ ల్లో బైజూస్ కంటెంట్ ను కూడా పొందుపరిచి విద్యార్థులకు అందిస్తారు. 

అంతేకాకుండా, తరగతి గదులను డిజిటలైజ్ చేయనున్నారు. అందులో భాగంగా ప్రతి క్లాస్ రూంకు స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 72,481 టీవీలు అవసరమని అధికారులు సీఎంకు తెలిపారు. క్లాస్ రూముల డిజిటలైజేషన్ కు రూ.512 కోట్లకు పైగా ఖర్చవుతుందని వివరించారు. ఈ టీవీలను దశలవారీగా తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్నారు. 

2023 మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ తొలిదశ పూర్తయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ప్రతి పాఠశాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజి క్లినిక్కుల్లోనూ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

More Telugu News