Amala Paul: తెలుగు సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయింది: నటి అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు

Actress Amala Paul Sensational Comments on tollywood
  • తెలుగులో అతి తక్కువ సినిమాల్లో కనిపించిన అమలాపాల్
  • టాలీవుడ్‌లో కొన్ని కుటుంబాలదే ఆధిపత్యమన్న నటి
  • హీరోయిన్స్‌ను గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితం చేస్తారని వ్యాఖ్యలు
  • తమిళ సినిమాతో కెరియర్ ప్రారంభం కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న అమలాపాల్
తెలుగు చిత్ర పరిశ్రమపై నటి అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయిందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 2011-2015 మధ్య తెలుగులో నాలుగు సినిమాలు మాత్రమే చేసి ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైన అమలాపాల్ ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తెలుగులో అతి తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలను వివరించారు.

తాను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఆ కుటుంబాలే చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారని అన్నారు. వారిని గ్లామరస్ గా చూపిస్తూ లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవని, అందుకనే తాను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

కెరియర్ తొలినాళ్లలో ఆడిషన్స్, మీటింగ్స్ వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న అమలాపాల్.. తమిళ సినిమాతో కెరియర్ ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. అయితే, కెరియర్ ప్రారంభంలో చేసిన రెండు సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదని, ఆ తర్వాత చేసిన ‘మైనా’ సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు. ఆ చిత్రం తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయని గుర్తు చేసుకున్నారు. అమలాపాల్ తెలుగులో 'నాయక్', ‘లవ్ ఫెయిల్యూర్’, ‘జెండాపై కపిరాజు’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి సినిమాల్లో నటించారు. ‘పిట్టకథలు’ సినిమాలో చివరిసారి కనిపించారు. తాజాగా, ఆమె నటించిన ‘కడవర్’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది.
Amala Paul
Kollywood
Tollywood

More Telugu News