Pawan Kalyan: కృష్ణంరాజు మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా: పవన్ కల్యాణ్

  • అస్వస్థతకు గురైతే కోలుకుంటారని భావించానన్న పవన్
  • ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలిపిన జనసేనాని
  • మనవూరి పాండవులు సినిమాలో కృష్ణంరాజు, చిరంజీవి కలిసి నటించారని గుర్తు చేసిన పవన్
Janasena Chief Pawan says he shocked to know about krishnam raju demise

కృష్ణంరాజు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు తనకంటూ ఓ ప్రత్యేక పంథా ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు. రౌద్ర రస పాత్రల్లోనే కాకుండా కరుణ రస ప్రధానమైన పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయారని అన్నారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురైన వార్త తెలిసి కోలుకుంటారని భావించానని, కానీ అంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని భావించలేదన్నారు. 

1978లో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ సినిమాలో ఆయనతో కలిసి అన్నయ్య చిరంజీవి నటించారని గుర్తు చేసుకున్నారు. భక్త కన్నప్ప సినిమాలో ఆయన నటన ప్రత్యేకమని పేర్కొన్న పవన్.. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం వంటి చిత్రాలు ఆయనేంటో నిరూపిస్తాయని అన్నారు. కేంద్రమంత్రిగా సేవలందించిన కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారని గుర్తు చేశారు. కృష్ణంరాజు కుటుంబానికి తన తరపున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News