Bihar: పనితీరు బాగాలేదని పోలీసులను సెల్‌లో వేసిన ఎస్పీ.. వీడియో ఇదిగో!

Bihar Police Officer Puts 5 Juniors In Lockup
  • బీహార్‌లోని నవాదా జిల్లాలో ఘటన
  • ముగ్గురు ఏఎస్పీలు, ఇద్దరు ఎస్సైలకు రెండు గంటల లాకప్ శిక్ష
  • విచారణకు డిమాండ్ చేసిన పోలీస్ అసోసియేషన్ సంఘం

పోలీసులు సాధారణంగా నేరగాళ్లను లాకప్‌లో వేస్తారు. కానీ ఓ ఎస్పీ తన కింది ఉద్యోగస్తులను లాకప్‌లోకి తోశారు. వారి పనితీరు ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ రెండు గంటలపాటు లాకప్‌లోనే ఉంచేశారు. బీహార్‌లోని నవాదా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు ఎస్సైల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ గౌరవ్ మంగళ వారికి శిక్ష విధించారు. ఆయన ఆదేశాలతో లాకప్‌లోకి వెళ్లిన పోలీసులు రెండుగంటలపాటు అందులోనే గడిపారు. 

విషయం వెలుగులోకి రావడంతో బీహార్ పోలీస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై ఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు మృత్యుంజయ్‌కుమార్ సింగ్ ఆరోపించారు. వలస పాలనకు ఏమాత్రం తగ్గని రీతిలో ఎస్పీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్పీ.. సీసీటీవీ ఫుటేజీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News