Amit Shah: రాహుల్ బాబా వచ్చాడు... విదేశీ టీషర్టు ధరించి భారత్ ను ఏకం చేసేందుకు యాత్ర సాగిస్తున్నాడు: అమిత్ షా వ్యంగ్యం

  • భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ 
  • ఫారెన్ బ్రాండ్ టీషర్టుతో కనిపించిన వైనం
  • విమర్శల దాడి ప్రారంభించిన బీజేపీ
  • ప్రజలు నవ్వుతున్నారన్న అమిత్ షా
Amit Shah opines on Rahul Gandhi seen wearing foreign brand t shirt

లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగా, ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా రంగంలో దిగాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టగా, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా దేశవ్యాప్తంగా సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. తాజాగా, అమిత్ షా రాజస్థాన్ లో పర్యటించారు. జోథ్ పూర్ లో ఆయన ప్రసంగిస్తూ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించారు. 

ఈ యాత్రలో రాహుల్ రూ.41 వేల విలువ చేసే ఫారెన్ బ్రాండ్ టీషర్టు ధరించడాన్ని బీజేపీ నేతలు టార్గెట్ చేయడం తెలిసిందే. తన ప్రసంగంలో అమిత్ షా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "ఇప్పుడు రాహుల్ బాబా తయారయ్యాడు.... ప్రజలు నవ్వుతారు మరి! మీరు (సభికులు) కూడా ఎందుకు నవ్వుతున్నారు? భారత్ ను ఏకం చేస్తానంటూ రాహుల్ బాబా బయటికొచ్చి పాదయాత్ర చేస్తున్నాడు కదా. కానీ విదేశీ టీషర్టు ధరించి కనిపించాడు. 

అతడు (రాహుల్) ఒకసారి పార్లమెంటులో మాట్లాడుతూ, భారత్ అసలు దేశమే కాదన్నాడు. భారత్ అనేకమంది త్యాగధనులకు జన్మనిచ్చిన దేశం అని తెలుసుకోవాలి. రాహుల్ బాబా భారతదేశాన్ని ఏకం చేసేముందు చరిత్ర చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని అమిత్ షా హితవు పలికారు. 

అంతేకాదు, కాంగ్రెస్ పైనా వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరో రెండు (రాజస్థాన్, చత్తీస్ గఢ్) రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉందని, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ కు ఇంకేమీ మిగలదని స్పష్టం చేశారు.

More Telugu News