Pawan Kalyan: తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan launches TFJA official website and social media accounts
  • పవన్ కల్యాణ్ ను కలిసిన టీఫ్ జేఏ ప్రతినిధులు
  • ల్యాప్ టాప్ ద్వారా వెబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాల ప్రారంభం
  • ఫిలిం జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ 
వివిధ మీడియా సంస్థలకు చెందిన సినీ పాత్రికేయులు తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎఫ్ జేఏ) ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీఎఫ్ జేఏ అధికారిక వెబ్ సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. పవన్ కల్యాణ్ ల్యాప్ టాప్ ద్వారా టీఎఫ్ జేఏ.ఇన్ వెబ్ సైట్ ను, టీఎఫ్ జేఏ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ఆవిష్కరించారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినీ పాత్రికేయులు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రెటరీ వై. జె. రాంబాబు గారు, ట్రెజరర్  నాయుడు  సురేంద్ర కుమార్ గార్ల ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి ఉండే పాత్రికేయ సంఘం అని అభినందించారు. 

"తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్  అసోసియేషన్ వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది. 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి రూ.3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత బీమా కింద రూ.15 లక్షలు, యాక్సిడెంట్ పాలసీ కింద రూ.25 లక్షలు ఇవ్వడం వారి కుటుంభం సభ్యులకి ధైర్యాన్ని ఇస్తుంది. 

ఈ 175 మంది జర్నలిస్టులపై ఆధారపడి ఉన్నవారితో కలిపి దాదాపు 700 మంది ఉన్నారని, వారికి  అవసరమొచ్చినప్పుడు ఈ బీమాల ద్వారా ఆసరా లభిస్తుంది. అలాగే వీరు ఆదర్శవంతమైన జర్నలిజం విలువలు పాటిస్తారని ఆశిస్తున్నాను. సమాజంలోని తప్పొప్పులని సరి చేసేలాగా, అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా, ఒకవేళ అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుంది అని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను" అంటూ పవన్ ప్రసంగించారు.
Pawan Kalyan
TFJA
Cine Journalists
Website
Social Media
Tollywood

More Telugu News