Rahul Dravid: 'హనీమూన్ టైం ముగిసింది..' అంటూ ద్రవిడ్​ పై బీసీసీఐ మాజీ సెలెక్టర్ వ్యాఖ్యలు

  • ద్రవిడ్ కోచింగ్ లో ఆసియా కప్ లో నిరాశ పరిచిన భారత్
  • వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో విషమ పరీక్ష
  • ద్రవిడ్ కు కష్టకాలం మొదలైందన్న మాజీ సెలెక్టర్ సబా కరీం 
Coach Rahul Dravids Honeymoon Period Is Over says Ex BCCI Selector

రవిశాస్త్రి స్థానంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా భారీ అంచనాలతో బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాహుల్ ద్రవిడ్. దిగ్గజ క్రికెటర్ గా పేరు ఉండటంతో పాటు భారత అండర్-19 టీమ్ జట్టును తీర్చిదిద్దిన నేపథ్యంలో ద్రవిడ్ పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రాహుల్ మార్గనిర్దేశంలో భారత జట్టు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. 

ముఖ్యంగా ఆసియా కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ టోర్నీలో అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిచిన జట్టు ఈసారి కనీసం ఫైనల్ చేరుకోలేకపోయింది. సూపర్- 4లో పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయిన తర్వాత రాహుల్ ద్రవిడ్ -కోచింగ్ లోని జట్టు ఇంటిదారి పట్టింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ద్రవిడ్ కఠిన పరీక్ష ఎదుర్కోనున్నాడని బీసీసీఐ మాజీ సెలక్టర్ సబా కరీమ్ అంటున్నాడు. ఈ క్రమంలో ద్రవిడ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

'‘తన హనీమూన్ కాలం ముగిసిపోయిందని రాహుల్ ద్రవిడ్‌కు కూడా తెలుసు. ద్రవిడ్ తన మార్కు చూపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఇప్పటివరకు మెప్పించలేకపోయాడు. ఇప్పుడు టీ 20 ప్రపంచ కప్ రాబోతోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఈ రెండు పెద్ద ఐసీసీ ఈవెంట్లను భారత్ గెలుచుకోగలిగితేనే ద్రవిడ్ తన కోచింగ్ పై సంతృప్తి చెందుతాడు.

ఇక తన కోచింగ్ కెరీర్‌ను విజయవంతంగా మార్చుకోవడానికి ఏకైక మార్గం ఐసీసీ ఈవెంట్లలో జట్టును గెలిపించడంతో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో టెస్ట్ సిరీస్‌లను గెలవడం అని అతనికి తెలుసు. ఆయా దేశాల్లో టెస్టు మ్యాచుల్లో గెలవడం ద్రవిడ్ కు ముఖ్యం కాదు. ఎందుకంటే ఆటగాడిగా ఈ దేశాల్లో ద్రవిడ్ విజయాల రుచి చూశాడు. కాబట్టి అక్కడ టెస్టు సిరీస్ లు గెలిస్తేనే రాహుల్ సంతృప్తి చెందుతాడు’' అని సబా కరీం పేర్కొన్నాడు.

More Telugu News