Naseem Shah: రెండు సిక్సర్లతో పాక్​ను గెలిపించిన బ్యాట్​ను వేలానికి పెట్టిన నసీమ్​ షా

  • రాత్రికి రాత్రే హీరోగా మారిన పాక్ యువ బౌలర్ నసీమ్
  • బ్యాట్ ను వేలానికి ఉంచాలని నిర్ణయం 
  • వచ్చిన మొత్తంలో సగం పాకిస్థాన్ లో వరద బాధితులకు సాయం  
Naseem Shah To Auction Bat With Which He Hit Two Sixes vs Afghanistan And Do This With The Money

ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఈ టోర్నీలోనే అత్యంత ఉత్కంఠభరితమైన పోరుగా మారింది. అనేక మలుపుల తర్వాత, బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ చివరి ఓవర్లో 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మరో వికెట్ మాత్రమే ఉండటంతో పాక్ పరాజయం అంచున నిలిచింది. అయితే, ఆప్ఘనిస్థాన్  బౌలర్ ఫజల్‌ హాక్ ఫరూఖీ వేసిన చివరి ఓవర్లో  మొదటి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలచిన యువ  పేసర్ నసీమ్ షా  పాకిస్థాన్ ను గెలిపించాడు. ఈ మెరుపులతో 19 ఏళ్ల నసీమ్ రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. 

నాడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో పాక్ ను గెలిపించిన నసీమ్ ఇప్పుడు మరో పనితో చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు. ఆప్ఘన్ పై రెండు సిక్సర్లు కొట్టిన బ్యాట్‌ను నసీమ్ కు అతని సహచరుడు మహ్మద్ హస్నైన్ బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ బ్యాట్ ను నసీమ్ వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో సగాన్ని పాకిస్థాన్ లో వరద బాధితులకు సాయం చేస్తానని తెలిపాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీసీ) ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 

గత నెల రోజుల నుంచి పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలు వరదలను ఎదుర్కొంటున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా దాదాపు 1,400 మంది మరణించారు. కాగా, ఆసియా కప్ లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే ఫైనల్లో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది.

More Telugu News