Andhra Pradesh: అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌పై మీ స్పంద‌నేంటి?.. ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టు ప్ర‌శ్న‌

  • అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కు పాద‌యాత్ర‌కు సిద్ధ‌మైన రాజ‌ధాని రైతులు
  • పోలీసుల అనుమ‌తి కోర‌గా స్పంద‌న రాలేదన్న రైతులు 
  • హైకోర్టును ఆశ్ర‌యించిన రాజ‌ధాని రైతులు
  • గురువారం సాయంత్రంలోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు
ap high court orders ap government to respond on rajadhani farmers letter by evenig

ఏపీ ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాలంటూ రాజ‌దాని రైతులు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై త‌న వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయ‌ని ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అమరావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో భాగంగా ఇప్ప‌టికే తిరుప‌తి దాకా పాద‌యాత్ర చేప‌ట్టిన రాజ‌ధాని రైతులు తాజాగా అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లికి మ‌హాపాద‌యాత్రకు సంక‌ల్పించారు. ఈ పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ రాష్ట్ర పోలీసు శాఖ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా... ఇప్ప‌టిదాకా పోలీసు శాఖ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదని రైతులు పేర్కొన్నారు.

దీంతో ఇటీవ‌లే త‌మ పాద‌యాత్ర‌కు పోలీసులు, ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రావ‌డం లేదని, ఈ వ్య‌వ‌హారంలో క‌ల్పించుకుని త‌మ‌కు న్యాయం చేయాలంటూ అమ‌రావ‌తి రైతులు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు... అమ‌రావ‌తి రైతులు చేసుకున్న విజ్ఞ‌ప్తికి పోలీసుల నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ఈ క్ర‌మంలో గురువారం సాయంత్రంలోగా రాజ‌ధాని రైతుల మ‌హాపాద‌యాత్ర‌పై ఏదో ఒక‌టి తేల్చాల‌ని పోలీసులు, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోర్టు ఆదేశించింది. లేని ప‌క్షంలో శుక్ర‌వారం తొలి కేసుగా ఈ పిటిష‌న్‌పైనే విచార‌ణ చేప‌డ‌తామంటూ హైకోర్టు చెప్పింది.

More Telugu News