Andhra Pradesh: ఆర్బీకేలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి: మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

  • అమిత్ షా ఆధ్వ‌ర్యంలో కోఆప‌రేటివ్ స‌ద‌స్సు
  • ఏపీ నుంచి హాజ‌రైన మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
  • న‌ష్టాల్లో ఉన్న స‌హ‌కార బ్యాంకుల‌ను లాభాల బాట ప‌ట్టించామ‌ని వెల్ల‌డి
ap minister kakani govardhan reddy attends wo day National Conference of the state Cooperative Ministers

ఆంధ్రప్ర‌దేశ్‌లో సహకార వ్యవస్థ, వ్యవసాయ రంగాల‌ను మరింత అభివృద్ధి పరిచేందుకు సీఎం వైయస్‌ జగన్‌ సూచనలు, సలహాలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఏపీలో త‌మ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన ఆర్బీకేలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయ‌న‌ అన్నారు. 

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర‌ సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో నిర్వహించిన కోఆపరేటివ్‌ సదస్సులో మంత్రి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ఆయ‌న‌ సదస్సులో ప్రస్తావించారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

అమిత్‌ షా కోఆపరేటివ్‌ వ్యవస్థపై అనేక సూచనలు, సలహాలు ఇచ్చారన్న కాకాణి.. జాతీయ స్థాయిలో కోఆపరేటివ్ రంగానికి సంబంధించి ఒక పాలసీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్న‌ట్లుగా కేంద్ర మంత్రి చెప్పార‌న్నారు. దేశ వ్యాప్తంగా స‌హ‌కార రంగంలో ఒకే చట్టాన్ని, వ్యవస్థను అమలు చేస్తే బాగుంటుందని అమిత్‌ షా చెప్పారన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలోనూ ప్రైమరీ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీని విస్తరించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్ప‌త్తుల‌ సర్టిఫికేషన్, మార్కెటింగ్‌కు అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కొన్ని సంస్థలను గుర్తిస్తున్నామని చెప్పారన్నారు.

ఏపీ సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టే నాటికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయన్న కాకాణి.. వాటికి సంబంధించి రూ.295 కోట్లు ఇన్‌ఫ్యూజన్‌ క్యాపిటల్‌ అందివ్వడంతో బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయని తెలిపారు. ప్రైమరీ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (ప్యాక్స్‌)లు కొన్ని నష్టాల్లో ఉన్నాయని... వాటికి సంబంధించి వీలైనంత త్వరగా లిక్విడేషన్‌ పూర్తి చేసి.. కొత్తగా ప్యాక్స్‌ ఏర్పాటు చేయడం, పునర్‌వ్యవస్థీకరించడం చేస్తామని చెప్పారు. ఏపీ సహకార వ్యవస్థకు అండగా నిలవాలని కేంద్రమంత్రిని కోరామ‌ని, అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించార‌ని చెప్పారు.

More Telugu News