Urvashi Rautela: పాక్ క్రికెటర్ నసీమ్ షాతో నటి ఊర్వశి రౌతేలా రీల్.. మండిపడుతున్న నెటిజన్లు

Actor Urvashi Rautela Trolled Over Insta Video Featuring Pak Bowler
  • భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరైన నటి ఊర్వశి రౌతేలా
  • పాక్ బౌలర్ నసీమ్ షాతో రీల్ చేసిన నటి
  • ట్రోల్స్‌తో విరుచుకుపడిన నెటిజన్లు
  • గతంలో రిషభ్‌ పంత్‌తోనూ ట్విట్టర్ వార్ 
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల తరచూ మీడియాలో హైలైట్ అవుతున్నారు. టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో ట్విట్టర్ వార్ సాగింది. తాజాగా, పాకిస్థాన్ క్రికెటర్ నసీమ్ షాతో ఇన్‌స్టా రీల్ చేసి విమర్శల పాలైంది. 

ఇంతకీ ఏమైందంటే.. ఆసియాకప్‌ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌కు ఊర్వశి హాజరైంది. ఈ సందర్భంగా పాక్ క్రికెటర్ నసీమ్ షాతో రీల్ చేసి దానిని షేర్ చేసింది. అంతే, అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రీల్ చేసేందుకు నీకు పాక్ క్రికెటరే దొరికాడా? అంటూ ఫైరవుతున్నారు. విమర్శల దాడికి తట్టుకోలేని ఊర్వశి ఆ వీడియోను తొలగించింది. 

ఇటీవల ఊర్వశి రౌతేలా, రిషభ్ పంత్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఆర్‌పీ అనే వ్యక్తి తనను కలిసేందుకు చాలా సేపు వెయిట్ చేశాడని చెప్పుకొచ్చింది. ఢిల్లీలో షూటింగ్ పూర్తయ్యాక రాత్రికి హోటల్‌కు చేరుకున్నానని, అప్పటికే తనను కలిసేందుకు ఆర్‌పీ ఎదురుచూస్తున్నాడని తెలిపింది. అయితే, తాను అలసిపోయి ఉండడంతో నిద్రపోయానని, తెల్లారి లేచి చూస్తే 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని పేర్కొంది. వాటిని చూశాక తనకు చాలా బాధ అనిపించిందని, తన కోసం ఓ వ్యక్తి చాలాసేపు వేచి చూసినా కలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత కలుద్దామని చెప్పి ముంబైలో అతడిని కలిశానని వివరించింది.

పంత్‌ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందన్న వార్తలు వచ్చాయి. ఊర్వశి వ్యాఖ్యలపై పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. పాప్యులారిటీ కోసం కొందరు ఇలాంటి అబద్ధాలు ఆడుతుంటారని, ఇది నిజంగా హాస్యాస్పదమని పేర్కొన్నాడు. అయితే, ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడు. పంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఊర్వశి.. పంత్‌ను చిన్నపిల్లాడిగా అభివర్ణించింది. ‘చోటూ భయ్యా.. నువ్వెళ్లి క్రికెట్ ఆడుకోవాలి. నిన్ను అపఖ్యాతి పాలు చేసేందుకు నేనేం చిన్నపిల్లను కాదు’ అని వ్యాఖ్యానించింది.
Urvashi Rautela
Pakistan
Naseem Shah
Asia Cup 2022

More Telugu News