Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ మంత్రిపై సీబీఐ రెయిడ్స్

  • కోల్ స్మగ్లింగ్ కేసులో మోలోయ్ ఘటక్ నివాసాల్లో సోదాలు
  • వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును స్మగ్లింగ్ చేశారంటున్న సీబీఐ
  • ఘటక్ పాత్ర ఉందనే కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వ్యాఖ్య
CBI raids on Mamata Banerjee minister

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె మంత్రివర్గంలోని సభ్యులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒకరిద్దరు రిమాండ్ లో కూడా ఉన్నారు. తాజాగా మరో బెంగాల్ మంత్రి మోలోయ్ ఘటక్ రూపంలో ఆమెకు సమస్య ఎదురైంది. బొగ్గు స్మగ్లింగ్ కేసులో ఆయనపై ఈరోజు సీబీఐ రెయిడ్స్ నిర్వహిస్తోంది. ఆయనకు చెందిన నాలుగు నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమ్ బర్దమాన్ జిల్లాలోని అసాన్ సోల్ లో ఉన్న మూడు నివాసాలు, కోల్ కతాలోని లేక్ గార్డెన్ లో ఉన్న ఒక నివాసంలో ఒకేసారి సోదాలను నిర్వహిస్తున్నారు. సోదాల్లో సీబీఐకి చెందిన మహిళా అధికారులు కూడా పొల్గొంటుండటం గమనార్హం. 

ఈ సందర్భంగా సీబీఐకి చెందిన అధికారులు మాట్లాడుతూ... కోల్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టామని... దర్యాప్తులో మోలోయ్ ఘటక్ పేరు వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఈ స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఏమిటనేది దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్మగ్లింగ్ లో ఘటక్ పాత్ర ఉందనే కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అసన్ సోల్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు చెందిన మైన్స్ నుంచి బొగ్గు స్మగ్లింగ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. బ్లాక్ మార్కెట్లో వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును అమ్మేశారని చెపుతోంది. గత కొన్నేళ్లుగా ఈ స్మగ్లింగ్ రాకెట్ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

మరోవైపు, ఇదే స్మగ్లింగ్ కేసులో మమత మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని గత శుక్రవారం 7 గంటల పాటు ఈడీ విచారించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రంపై అభిషేక్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ కోల్ మైన్స్ కు సీఐఎస్ఎఫ్ బలగాలు కాపలాగా ఉన్నాయని... ఈ ఏజెన్సీ కేంద్ర హోం శాఖకు రిపోర్టులు పంపుతుంటుందని చెప్పారు. 

రాజకీయ లబ్ధి కోసం, విపక్షాలపై కక్ష సాధింపుల కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతను 'పప్పు' అని బీజేపీ అంటుంటుందని... కానీ వాస్తవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే 'పెద్ద పప్పు' అని అన్నారు. కేంద్ర వ్యవస్థల సహకారం లేకుండా ఆయన రాజకీయాలు చేయలేరని ఎద్దేవా చేశారు.

More Telugu News