Heinz: డ్రెస్ లకు టమాటా సాస్ పూసి.. కొత్త కలెక్షన్ అంటూ విడుదల చేసిన సంస్థ.. వీడియో ఇదిగో

Heinz fashion range with ketchup stains
  • ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరకల గురించి ఆలోచించవద్దంటూ ప్రచారం
  • ఈ వస్త్రాల అమ్మకంతో వచ్చే డబ్బులను స్వచ్చంద సంస్థకు ఇస్తామని ప్రకటన
  • తమ ఉత్పత్తుల ప్రచారం కోసం హెయింజ్ ఎత్తుగడ ఇది అనే అభిప్రాయాలు
నిత్యం ఫ్యాషన్ రంగం కొత్త పోకడలు పోవడం సాధారణమే. అప్పుడప్పుడూ ఆ ఫ్యాషన్లను చూస్తుంటే.. ఇవేం డ్రెస్సులురా బాబూ అనిపిస్తుంటుంది. చిత్రమైన ఫీలింగ్ కూడా వస్తుంటుంది. అలాంటిది టమాటా సాస్ ను డ్రెస్సులకు పూసి.. ఇదో కొత్త ఫ్యాషన్ రేంజ్ అంటూ విడుదల చేస్తే.. అదేం పిచ్చి పని అనిపిస్తుంది కదా. టమాటా, ఇతర సాస్ లు, కెచప్ లను ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థ హెయింజ్ ఈ పనే చేసింది. ఆ వస్త్రాలు కూడా అప్పటికే వేసుకుని, మరకలు అంటించినవే కావడం మరింత చిత్రం.

పేదల ఆకలి తీర్చే స్వచ్చంద సంస్థకు..
ఇలా కెచప్, సాస్ పూసిన డ్రెస్ ల ను విడుదల చేసిన హెయింజ్ దీనికి సంబంధించిన వీడియోనూ, ఫొటోలను విడుదల చేసింది. పిల్లల నుంచి పెద్దల దాకా ఈ డ్రెస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ డ్రెస్సులను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేసే ఓ స్వచ్చంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్టు హెయింజ్ సంస్థ ప్రకటించింది. ఇంతా చేసి హెయింజ్ సంస్థ అమ్మకానికి పెట్టిన డ్రెస్సులు ఎన్నో తెలుసా.. కేవలం 157 మాత్రమే.

వృథా చేయవద్దన్న ఉద్దేశం కూడా..
ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరకల గురించి ఆలోచించవద్దనేది, ఆ మరకలు కూడా వస్త్రాలకు అందమేననే ఉద్దేశంతో తాము ఈ ప్రయోగం చేశామని హెయింజ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మరకలు పడినా వస్త్రాలను ఉపయోగించుకోవాలని.. వృథా చేయవద్దన్న మంచి ఉద్దేశం కూడా దీనిలో దాగి ఉందని అంటున్నారు. ఆహారాన్ని ఇష్టపడేవారికి తమ ప్రయోగం బాగా నచ్చుతుందని పేర్కొంటున్నారు. అయితే హెయింజ్ సంస్థ ఇదంతా తమ కెచప్ లు, సాస్ ల ప్రచారం కోసమే చేసిందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Heinz
Heinz ketchup
Tomato ketchup
Offbeat
Fashion
New dress

More Telugu News