Chandrababu: ఆసుపత్రికి వెళ్లి చెన్నుపాటి గాంధీని పరామర్శించిన చంద్రబాబు

  • విజయవాడలో టీడీపీ నేత గాంధీపై దాడి
  • కంటికి తీవ్ర గాయం
  • ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో చికిత్స
  • గాంధీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
  • వైసీపీ నేతలు కూడా రోడ్లపై తిరగలేని రోజొస్తుందని హెచ్చరిక
Chandrababu visits Chennupati Gandhi at LV Prasad Eye Hospital

కొన్నిరోజుల కిందట విజయవాడలో దాడికి గురైన టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీని పార్టీ అధినేత చంద్రబాబు నేడు పరామర్శించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. గత శనివారం విజయవాడలో చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు దాడి చేశారని చంద్రబాబు వెల్లడించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి చెన్నుపాటి గాంధీని పరామర్శించానని తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పానని వివరించారు.

వైసీపీ రౌడీలు గాంధీ కంటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం చాలా ఘోరం అని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలపై జరుగుతున్న ప్రతి దాడి వెనుక జగన్ రెడ్డి ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తోందని, లేకపోతే, ఇది ఎమోషనల్ గా జరిగిన దాడి అంటూ పోలీసులు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఏం... మా వాళ్లకు లేవా ఎమోషన్స్? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

గాంధీపై జరిగిన దాడి విషయంలో దోషులకు శిక్ష పడేంతవరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. "హత్యా రాజకీయాలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవాలా? ఓడిపోతామన్న భయంతో వైసీపీ రౌడీలు చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రోడ్లపై తిరగలేని రోజు వస్తుంది... జాగ్రత్త" అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

More Telugu News