Karnataka: బెంగళూరును అతలాకుతలం చేసిన భారీ వర్షాలు.. వీడియో ఇదిగో

  • గత కొన్ని రోజులుగా బెంగళూరును కుదిపేస్తున్న వర్షాలు
  • ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • నీటమునిగిన పలు ప్రాంతాలు
  • తమను రక్షించాలంటూ ఖరీదైన సొసైటీల్లోని ప్రజల విజ్ఞప్తి
Heavy rain continues to batter Bengaluru

బెంగళూరులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణుకుతోంది. తాజాగా ఈ ఉదయం కురిసిన వర్షం పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పలువురు నీటిలో చిక్కుకుపోయారు. నగరంలోని బెలందూర్, సర్జాపురా రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు, బీఈఎంఎల్ లే అవుట్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

 మరాఠహళ్లి సమీపంలోని స్పైస్ గార్డెన్ వద్ద బైకులు నీటిపై తేలుతూ కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో వరద ముంచెత్తడంతో స్పైస్ గార్డెన్ నుంచి వైట్‌ఫీల్డ్ వెళ్లే దారి స్తంభించిపోయింది. నగరంలో పలు ఖరీదైన సొసైటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తమను రక్షించాలంటూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి సొసైటీ ప్రజలు విజ్ఞప్తి చేశారు. 

రోడ్లన్నీ చెరువుల్లా మారడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇక వీధుల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఈ నెల 9వ తేదీ వరకు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బెంగళూరు, కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్‌మగళూరు జిల్లాల్లో నేటి నుంచి 9 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరించిన ఐడీఎం యెల్లో అలెర్ట్ జారీ చేసింది. సముద్రం ప్రమాదకరంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల జాలర్లకు హెచ్చరించింది. 

అలాగే, వచ్చే నాలుగు రోజుల్లో బీదర్, కలబురగి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి, దావణగెరెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుకుంటున్న ఆక్రమణలను తొలగిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News