Pakistan: ఈసారి పాకిస్థాన్ గెలిచింది... టీమిండియాకు నిరాశ

This time Pakistan beat India in Asia Cup
  • దుబాయ్ లో ఉత్కంఠభరితంగా మ్యాచ్
  • మరో బంతి మిగిలుండగానే పాకిస్థాన్ విజయం
  • రాణించిన రిజ్వాన్, నవాజ్
  • కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆసిఫ్ అలీ, కుష్దిల్

ఆసియా కప్ సూపర్-4 లో టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని పాక్ 5 వికెట్ల కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. చివర్లో కొంత ఉత్కంఠ ఏర్పడినప్పటికీ అంతిమంగా పాక్ నే గెలుపు వరించింది. 

కాగా, భారీ లక్ష్యఛేదనను పాక్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. రిజ్వాన్ స్కోరులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ బాబర్ అజామ్ 14, ఫకార్ జమాన్ 15 పరుగులు చేశారు. మహ్మద్ నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేయడం విశేషం. రిజ్వాన్, నవాజ్ క్రీజులో ఉన్నంత సేపు స్కోరుబోర్డు వేగంగా ముందుకు కదిలింది. 

చివర్లో పాక్ విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్ బౌలింగ్ లో ఆసిఫ్ అలీ ఓ సిక్స్, ఫోర్, కుష్దిల్ షా ఓ ఫోర్ కొట్టి రన్ రేట్ తగ్గించారు. చివరి ఓవర్లో పాక్ గెలుపునకు 7 పరుగులు అవసరం కాగా.... ఆసిఫ్ ఓ బౌండరీ బాదాడు. అయితే అర్షదీప్ ఆ తర్వాత బంతులు కట్టుదిట్టంగా విసిరి ఓ వికెట్ కూడా తీశాడు. దాంతో పాక్ 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి వచ్చింది. 

క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ స్ట్రెయిట్ షాట్ కొట్టి రెండు పరుగులు తీయడంతో పాక్ విజయం సాధించింది. చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కుష్దిల్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసిఫ్ అలీ 16 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, రవి బిష్ణోయ్ 1, హార్దిక్ పాండ్యా 1, చహల్ 1, అర్షదీప్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 28, కేఎల్ రాహుల్ 28 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, భారత్ సూపర్-4 దశలో తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబరు 6న శ్రీలంకతో ఆడనుంది.

  • Loading...

More Telugu News