London: ఆరు కోట్ల లగ్జరీ కారును లండన్ నుంచి కరాచీ ఎత్తుకెళ్లి.. చిన్న తప్పిదంతో దొరికిన దొంగలు!

  • లండన్ లోని  విలాసవంతమైన ఏరియాలో బెంట్లీ  కారును కొట్టేసిన దొంగలు
  • దౌత్యవేత్త పత్రాలో కరాచీ చేరవేత
  • కారులోని ట్రేసింగ్ ట్రాకర్  ఆఫ్ చేయడం మరిచిన వైనం
  • అధునాతన టెక్నాలజీతో కారును గుర్తించిన యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ 
High end Bentley car stolen from London was found in Pakistans Karachi

కొన్ని వారాల కిందట లండన్ లో చోరీకి గురైన ఖరీదైన కారు పాకిస్థాన్‌లోని కరాచీలో దొరికింది. దొంగలు కారును బ్రిటన్ నుంచి పాకిస్థాన్‌ కు తీసుకురావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కారును కొన్ని వేల కిలోమీటర్లు దాటించిన దొంగలు చిన్న తప్పిదం కారణంగా దొరికిపోయారు. లండన్ లో ఓ విలాసవంతమైన ప్రాంతంలో దాదాపు ఆరు కోట్ల రూపాయల విలువైన బెంట్లీ ముల్సాన్నే లగ్జరీ కారును ఇంటి ముందు యజమాని పార్క్ చేశారు. దాన్ని ఎత్తుకొచ్చిన దొంగలు కరాచీ నగరానికి చేర్చారు. యజమాని ఫిర్యాదు మేరకే యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ విచారణ చేపట్టింది. కారులోని అధునాతన ట్రాకింగ్ సిస్టమ్ ను ట్రేస్ చేశారు. ఈ క్రమంలో కారు కరాచీలో ఉన్నట్టు గుర్తించింది. ఈ విషయాన్ని కరాచీలోని కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కలెక్టరేట్(సీసీఈ)కు చేరవేసింది. 

ఆ సమాచారంతో సీసీఈ కరాచీలోని ఓ బంగ్లాకు చేరుకుని సోదాలు చేసింది. ఈ దాడిలో పాకిస్థాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో కూడిన బెంట్లీని కనుగొన్నారు. తనిఖీ చేయగా యూకే అధికారులు అందించిన వాహనం వివరాలతో కారు ఛాసిస్ నంబర్ సరిపోలినట్లు గుర్తించారు. బంగ్లా యజమాని తగిన పత్రాలు అందించకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి అతడిని అరెస్ట్ చేశారు. అతనికి కారు అమ్మిన బ్రోకర్‌ను కూడా అరెస్టు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ నకిలీదని అధికారులు తెలిపారు. దొంగతనంలో పాల్గొన్న వారు బెంట్లీలోని ట్రేసింగ్ ట్రాకర్‌ను తీసివేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడంలో విఫలమై దొరికిపోయారు. ఈ అధునాతన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాహనం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొన్నారు. 

కాగా, ఈ లగ్జరీ కారును దొంగిలించిన వాళ్లు తూర్పు యూరోపియన్ దేశానికి చెందిన అగ్ర దౌత్యవేత్త పత్రాలను ఉపయోగించి దాన్ని పాకిస్థాన్‌కు దిగుమతి చేసుకున్నారని తెలుస్తోంది. కస్టమ్స్ అధికారుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. దిగుమతికి గాను భారీ మొత్తంలో పన్ను కూడా ఎగవేశారు. అయితే, కారు దొగతనం రాకెట్ ప్రధాన సూత్రధారి కోసం ఇంకా అన్వేషిస్తున్నామని ఓ అధికారి తెలిపారు.

More Telugu News