tennis: రాకెట్ తగిలి నాదల్ ముక్కు నుంచి చిందిన రక్తం

  • యూఎస్ ఓపెన్ రెండో రౌండ్ లో టెన్నిస్ దిగ్గజానికి గాయం
  • బాల్ ను రిటర్న్ చేస్తుండగా తన రాకెట్టే తగిలి ముక్కుపై కోత
  • అయినా మ్యాచ్ కొనసాగించి గెలిచిన నాదల్
Rafael Nadal accidentally hits himself on the nose by racket

యూఎస్ ఓపెన్లో పోటీ పడుతున్న స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ కు గాయమైంది. దురదృష్టవశాత్తు సొంత రాకెట్ తగిలి నాదల్ ముక్కు నుంచి రక్తం వచ్చింది. గురువారం రెండో రౌండ్‌లో ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అతనికి ఈ గాయమైంది. 

ఫోగ్నినిపై 2-6, 6-4, 6-2, 6-1తో విజయం సాధించిన నాదల్ మూడో రౌండ్ చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రౌండ్ లో ఓ బంతిని తక్కువ ఎత్తు నుంచి బ్యాక్ హ్యాండ్ తో రిటర్న్ చేసే ప్రయత్నంలో అతని రాకెట్ నేలను తగిలి బౌన్స్ అయి ముఖానికి తగిలింది. దీనికి నాదల్ ముక్కు పైభాగం చర్మం కట్ అయి రక్తం వచ్చింది. నొప్పితో బాధ పడ్డ నాదల్ కోర్టులో కాసేపు పడుకుండిపోయాడు. దాంతో, అందరూ కంగారు పడ్డారు. 

అయితే, కోర్టులోనే వైద్యుడితో చికిత్స చేయించుకున్న తర్వాత నాదల్ మళ్లీ మ్యాచ్ లోకి వచ్చాడు. ఫోగ్నినిపై సునాయాస విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గోల్ఫ్ ఆడుతుండగా గతంలో తనకు ఇలాంటి గాయాలు అయ్యాయని, కానీ, తన టెన్నిస్ రాకెట్‌తో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చమత్కరించాడు. 

నాదల్ గాయంతో ఆడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నాదల్ కాలు నొప్పితోనే ఆడి విజయం సాధించాడు. ఆ తర్వాత వింబుల్డన్‌ క్వార్టర్ ఫైనల్లో పొత్తి కడుపుపై చీలిక ఏర్పడినా కూడా ఆటను కొనసాగించాడు.

More Telugu News