Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసు.. మనీశ్ సిసోడియా బ్యాంక్ లాంకర్లను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు.. వీడియో ఇదిగో!

CBI opened Manish Sisodia bank lockers
  • ఆప్ ను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసు
  • డిప్యూటీ సీఎం సహా 15 మందిపై సీబీఐ కేసులు
  • విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న సిసోడియా
లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ జరుపుతున్న విచారణ ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. విచారణలో భాగంగా ఈరోజు ఘజియాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న మనీశ్ సిసోడియాకు చెందిన బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియాతో పాటు ఆయన భార్య కూడా బ్యాంకు వద్దే ఉన్నారు. 

మరోవైపు, తమ ఎక్సైజ్ విధానంపై ఆరోపణలు రావడంతో దాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ కేసులో సిసోడియా సహా 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే కొత్త లిక్కర్ పాలసీని ఆప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. అర్హత లేని విక్రేతలకు లైసెన్సులను కట్టబెట్టారని, లంచాలు తీసుకుని లైసెన్సులు ఇచ్చారని ఆరోపించింది. గత ఏడాది నవంబర్ లో కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు పాలసీని ఉపసంహరించుకుంది. 

ఇంకోవైపు, రెండు వారాల క్రితమే సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలను నిర్వహించారు. నిన్న ట్విట్టర్ ద్వారా సిసోడియా స్పందిస్తూ... రేపు తన బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు తనిఖీ చేయబోతున్నారని... తన లాకర్లలో వారికి ఏమీ దొరకదని అన్నారు. ఆగస్ట్ 19న తన నివాసంలో 14 గంటల పాటు సోదాలను నిర్వహించారని... అయినా వారు గుర్తించింది ఏమీ లేదని చెప్పారు. తాను, తన కుటుంబం సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
Manish Sisodia
AAP
Delhi Liquor Case
CBI
Bank Lockers

More Telugu News