Yellow Crazy Ants: తమిళనాడులో ప్రమాదకరమైన చీమలు.. జంతువులను తినేస్తున్న వైనం

Yellow Crazy Ants That Are Leaving Snakes Dead And Causing Cattle To Go Blind In Tamil Nadu
  • పాములు, కుందేళ్లను తినేస్తున్న చీమల దండు
  • దిండిగల్ జిల్లాలోని అటవీ సమీప ప్రాంతాల్లో అసాధారణ పరిస్థితులు
  • గ్రామాలను ఖాళీ చేస్తున్న ప్రజలు
బలవంతమైన సర్పము.. చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!.. ఇది సుమతీ శతకకారుడి పద్యం. ఆయన చెప్పింది అక్షరాలా నిజం.  అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది చలి చీమల గురించి కాదు. ఎర్రటి చీమలు అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి దాడి చేస్తున్నాయి. కలసికట్టుగా కీటకాలు, పాములు, జంతువులను తినేస్తున్నాయి. ఇది ఆఫ్రికా దేశంలో అని అనుకోవద్దు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా కరతమలై అటవీ పరిసర గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితి.

వీటి పేరు ఎల్లో క్రేజీ యాంట్స్. ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో ఇవి కనిపిస్తుంటాయి. మన దగ్గర కొత్తగా వీటి అస్తిత్వం బయటకు వచ్చింది. ఈ చీమల వల్ల పశువులకు కంటి చూపు పోతోంది. పంటలకు నష్టం కలుగుతోంది. పాములు, కుందేళ్లు, ఇతర చిన్న పాటి జంతువులను ఈ చీమల దండు దాడి చేసి తినేస్తోంది. వీటికంటూ ఫలానా ఆహారం ఏదీ లేదని, కనిపించిన దేన్నయినా తినేస్తాయని ఎల్లో క్రేజీ యాంట్స్ పై పరిశోధన చేసిన ఎంటమాలజిస్ట్ డాక్టర్ ప్రణయ్ బైద్య తెలిపారు.

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన 100 జాతుల్లో ఎల్లో క్రేజీ యాంట్స్ కూడా ఒకటి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెబుతోంది. చీమ అంటే కుడుతుంది. కానీ, ఎల్లో క్రేజీ యాంట్స్ కుట్టవు. ఫార్మిక్ యాసిడ్ ను చిమ్ముతాయి. ఇది కళ్లల్లో పడితే కంటి చూపు పోతుంది. ఒక్కో చీమ 4ఎఎం పొడువు ఉంటుంది. పొడవాటి కాళ్లు ఉంటాయి. తలపై పొడవాటి యాంటెన్నాలా ఉంటుంది. 

ఈ చీమల దాడి, పంటల నష్టంతో దిండిగల్ జిల్లాలోని గ్రామాల నుంచి ప్రజలు వలసపోతున్నారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఈ చీమలను తాము సమీప అడవుల్లో చూస్తున్నామని.. కానీ, పెద్ద సంఖ్యలో గుంపులుగా గ్రామాల్లోకి రావడం ఇదే మొదటిసారిగా స్థానికులు చెబుతున్నారు. చీమల మందు చల్లినా కానీ వాటిని నియంత్రించలేకపోతున్నారు. పైగా వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉందంటున్నారు. ప్రజల వినతి మేరకు అటవీ అధికారులు నిపుణుల సాయం కోరారు. 
 


Yellow Crazy Ants
tamilnadu
damage
snakes
rabbits

More Telugu News