KCR: ఈ నెల 31న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో సీఎం కేసీఆర్ భేటీ

Telangana CM KCR will meet Bihar CM Nitish Kumar
  • ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగడుతున్న కేసీఆర్
  • జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయం
  • తరచుగా రాష్ట్రాల పర్యటనలకు వెళుతున్న కేసీఆర్
ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగట్టి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వీలు చిక్కినప్పుడల్లా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తన జాతీయ రాజకీయాల కార్యాచరణలో భాగంగా ఆయన ఈ నెల 31న బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో సమావేశం కానున్నారు. పాట్నాలో నితీశ్ కుమార్ తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని తెలుస్తోంది. 

కాగా, చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను కూడా సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో కలవనున్నారు. అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయాన్ని ఈ సందర్భంగా వారికి అందిస్తారు. 

అంతేకాదు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి 12 మంది బీహార్ వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్న సీఎం కేసీఆర్... బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారు.
KCR
Nitish Kumar
Bihar
Telangana

More Telugu News