Supreme Court: బాలకృష్ణ, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, టాలీవుడ్ నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notices to Balakrishna and Telugu states govts
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రేక్షకుల వినియోగదారుల సంఘం
  • గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాలకు పన్ను రాయితీ
  • కానీ టికెట్ రేట్లు తగ్గించలేదన్న వినియోగదారుల సంఘం
  • రాయితీలను ప్రేక్షకులకు బదలాయించలేదని ఆరోపణ 
  • డబ్బు రికవరీ చేయాలని సుప్రీంలో పిటిషన్
టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణకు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాల నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేట్లు తగ్గించలేదని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పన్ను రాయితీ పొందిన మేర డబ్బును ఆయా నిర్మాతల నుంచి తిరిగి రాబట్టాలని ఆ పిటిషన్ లో కోరారు. 

రుద్రమదేవికి తెలంగాణలో రాయితీ ఇవ్వగా, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయితీ ఇచ్చారని పిటిషన్ లో వెల్లడించారు. కానీ ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు. 

ఈ పిటిషన్ ను డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం, బాలకృష్ణకు, ఆయా చిత్రాల నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది. తమ నోటీసులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.
Supreme Court
Balakrishna
Andhra Pradesh
Telangana
Tollywood

More Telugu News