Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ న్యాయ పోరాటం
  • హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ
  • ప్రైవేటీకరణ ఆర్టికల్ 21కి విరుద్ధమని వెల్లడి
  • ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోందన్న ఏజీ
High Court take up hearing on Lakshmi Narayana petition over Vizag Steel Plant privatization

విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన తరఫు న్యాయవాది బాలాజీ ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆర్టికల్ 21కు విరుద్ధమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలమంది రైతుల నుంచి 22 వేల ఎకరాలు సేకరించారు. 9,200 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు. కొన్ని కుటుంబాల్లో నాలుగో తరం వచ్చినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని న్యాయవాది బాలాజీ కోర్టుకు వివరించారు. 

అటు, ఏపీ సర్కారు తరఫున ఏజీ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని కోర్టుకు నివేదించారు. ప్రైవేటీకరణకు బదులు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ప్రతిపాదించామని తెలిపారు.

 వాదనలు విన్న హైకోర్టు దర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్రం, ఆర్ఐఎన్ఎల్, రాష్ట్ర ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ లను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇప్పటికే పార్లమెంటులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్రం గతంలోనే ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

More Telugu News