Ghulam Nabi Azad: ఆ లేఖ రాసిన తర్వాతే కాంగ్రెస్​ లో నన్ను టార్గెట్ చేశారు: గులాం నబీ ఆజాద్

  • పార్టీలో స్వార్థపరులే తనను లక్ష్యంగా చేసుకున్నారని వ్యాఖ్య
  • ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత
  • జమ్మూ కశ్మీర్లో కొత్త పార్టీ ప్రారంభిస్తానని ప్రకటన 
Congress had issue with me since G23 letter was written says Ghulam Nabi Azad

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత  గులాం నబీ ఆజాద్.. గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు. జీ-23 నేతల్లో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీకి తనతో సమస్య ఉందని అన్నారు. తన రాజీనామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాకుగా చూపుతున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. 

‘జీ-23లో పాత్ర తర్వాత  నన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌లోని కొందరు స్వార్థపరులు మాత్రమే నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి, కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు’ అని ఆజాద్ పేర్కొన్నారు. కపిల్ సిబల్, జితిన్ ప్రసాద, యోగానంద్ శాస్త్రి తర్వాత పార్టీ నుంచి వైదొలిగిన జీ-23 గ్రూపులో గులాం నబీ ఆజాద్ నాలుగో నాయకుడు. 

ఇక, పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవడంపై గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘మోదీకి చిక్కింది నేను కాదు, ఆయనే’ అని ఎద్దేవా చేశారు. ఆగస్ట్ 26న పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ చేరుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్‌లో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

More Telugu News