Jay Shah: నిన్న టీమిండియా గెలిచిన తర్వాత జాతీయ జెండా ఇస్తే వద్దన్న బీసీసీఐ సెక్రటరీ జైషా.. కారణం ఇదేనట!

  • నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓడించిన టీమిండియా
  • స్టేడియంలో భారత్ విజయాన్ని ఆస్వాదించిన జైషా
  • త్రివర్ణ పతాకాన్ని జైషా తీసుకోకపోవడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
This is the reason why BCCI Secretary Jay Shah rejected to take Indian national flag

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థిపై మన జట్టు ఘన విజయం సాధించడంతో భారత్ లో సంబరాలు మిన్నంటాయి. టపాసులు పేలుస్తూ, జాతీయ జెండాను చేతబట్టి టీమిండియా గెలుపును జనాలు పండుగలా జరుపుకున్నారు. 

మరోవైపు, ఈ మ్యాచ్ ను బీసీసీఐ సెక్రటరీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. ఇండియా గెలిచిన వెంటనే జైషా ఆనందంలో మునిగిపోయారు. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ విజయానందాన్ని అనుభవించారు. అయితే ఇదే సమయంలో ఆయనకు పక్కనున్న వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని అందించబోగా... ఆయన వద్దంటూ, చప్పట్లు కొడుతూ విజయాన్ని ఆస్వాదించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. 


త్రివర్ణ పతాకాన్ని వద్దన్న జైషాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ లో కూడా #JayShah ట్రెండ్ అయింది. బీజేపీయేతర నేత జాతీయపతాకాన్ని తిరస్కరిస్తే బీజేపీ నేతలంతా మీద పడిపోయేవారని... దేశ వ్యతిరేకి ముద్ర వేసేవారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే, జైషాను విమర్శించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు. జైషా కేవలం బీసీసీఐ సెక్రటరీ మాత్రమే కాదని... ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా అని... అందుకే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆసియా కప్ లో భాగమైన అన్ని దేశాల విషయంలో ఆయన తటస్థ వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుందని చెపుతున్నారు.

More Telugu News