Lying down Championship: ఏమీ చేయొద్దు.. నిద్రపోతే చాలు డబ్బులిస్తారు.. సరికొత్త పోటీ!

  • యూరప్ దేశం మాంటెనెగ్రోలో ఏటా జరిగే పోటీ..
  • ఈసారి 60 గంటలు పడుకుని బహుమతి గెలుచుకున్న యువకుడు
  • గత ఏడాది 117 గంటలు నిద్రపోయిన రికార్డు
Annual lying down championship in Montenegro

ఏమీ చేయకుండా డబ్బులొస్తాయా.. కష్టపడాలి అంటుంటారు. కానీ అక్కడ మాత్రం ఏమీ చేయకుంటేనే డబ్బులొస్తాయి. అస్సలు లేవకుండా మంచంపై వాలిపోతే చాలు.. వేలకు వేలు ఇస్తారు. ఎందుకంటే ఇది నిద్రపోయే పోటీ (లైయింగ్ డౌన్ కాంపిటీషన్). యూరప్ ఖండంలోని మాంటెనెగ్రో దేశంలోని నిక్సిక్ అనే నగరంలో ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఎవరు ఎక్కువ సేపు మంచంపై పడుకుండిపోతే వారికి బహుమతి ఇస్తారు.

చెట్టు కింద మంచాలు వేసి..
నిక్సిక్ లో దాదాపు 12 ఏళ్లుగా ఈ లైయింగ్ డౌన్ పోటీ జరుగుతోంది. ఈ ఏడాది కూడా వంద ఏళ్ల వయసున్న ఓ పెద్ద చెట్టు కింద మంచాలు వేసి పోటీ నిర్వహించారు. ఈ పోటీలో జర్కో పెజనోవిక్ అనే యువకుడు 60 గంటల పాటు మంచంపైనే ఉండి బహుమతి గెలుచుకున్నాడు. అతడికి బహుమతి కింద రూ.27 వేలతోపాటు తనతోపాటు మరొకరికి రెస్టారెంట్‌ లో భోజనం, ఒక వీకెండ్‌ స్టే, రివర్‌ రాఫ్టింగ్‌ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 

అలా ఉండిపోవడం సులువేం కాదు..

  • ఏ పని చేయకుండా మంచంపై వాలి డబ్బులు సంపాదించడం సులువు అనిపిస్తుందిగానీ.. అది చాలా కష్టమని పోటీలో గెలుపొందిన జర్కో పెజనోవిక్ చెప్పారు. తన వద్దకు కుటుంబ సభ్యులుగానీ, స్నేహితులుగానీ ఎవరైనా వచ్చినప్పుడు లేవకుండా ఉండటం కష్టమేనని వివరించాడు.
  • మొత్తం తొమ్మిది మంది పోటీ పడినా.. అందులో ఏడుగురు తొలిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండు రోజులు మిగతా ఇద్దరే పోటీ పడ్డారు. చివరికి జర్కో గెలిచాడు.
  • పోటీలో ఆరు బయటే చెట్టు కింద మంచాలపై పడుకోవాల్సి ఉంటుంది. అయితే వర్షం వచ్చినప్పుడు మాత్రం పక్కనే ఉన్న గుడిసెలోకి తరలిస్తారు. 
  • గత ఏడాది 117 గంటలపాటు పడుకుని ఉండి అలెక్సిక్‌ అనే వ్యక్తి బహుమతి అందుకున్నాడు. ఈసారి అందులో సగం సమయమే నమోదైంది.

More Telugu News