Virat Kohli: ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ అంటూ పాక్ కెప్టెన్ పై కోహ్లీ ప్రశంసలు

  • 2019 ప్రపంచకప్ లో బాబర్ ఆజంను తొలిసారి కలిశానన్న కోహ్లీ 
  • అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పట్ల అతని గౌరవంలో మార్పులేదని వ్యాఖ్య 
  • బాబర్ బ్యాటింగ్ ను చూడటాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తానన్న కోహ్లీ 
Virat Kohli praises Azam Babar

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 2019 ప్రపంచకప్ లో తొలిసారి బాబర్ ఆజంను తాను కలిశానని... తన పట్ల బాబర్ ఎప్పుడూ ఎంతో గౌరవంతో, ప్రేమతో మెలిగాడని చెప్పాడు. కెరీర్లో బాబర్ ఎదుగుతున్నప్పటికీ అతనిలో కొంచెం మార్పు కూడా రాలేదని ప్రశంసించాడు. అన్ని ఫార్మాట్లలో కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్ మెన్ బాబరే కావచ్చని అన్నాడు. 

2019 వరల్డ్ కప్ సందర్భంగా మాంచెస్టర్ లో మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇమాద్ (వసీమ్) తనను కలిశాడని... అండర్ 19 క్రికెట్ నుంచి ఇమాద్ తో తనకు పరిచయం ఉందని... తాము అప్పటి నుంచే క్రికెట్లో పోటీ పడ్డామని కోహ్లీ తెలిపాడు. బాబర్ తనతో మాట్లాడాలనుకుంటున్నట్టు ఇమాద్ తనకు చెప్పాడని... దీంతో, తాము ముగ్గురం కూర్చొని చాలా సేపు ముచ్చటించుకున్నామని వెల్లడించాడు. అప్పుడు బాబర్ లో ఎంతో గౌరవాన్ని, అభిమానాన్ని చూశానని... ఇప్పటికే అందులో ఎలాంటి మార్పు రాలేదని కితాబునిచ్చారు.  

బాబర్ ఆజంలో అద్భుతమైన ప్రతిభ ఉందని... అతని బ్యాటింగ్ ను చూడటాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని కోహ్లీ చెప్పాడు. బాబర్ లో క్రికెట్ ఫౌండేషన్ చాలా బలంగా ఉందని కొనియాడాడు. ఇలాంటి ఆటగాళ్లు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ప్లేయర్లు ఎన్నో ఏళ్ల పాటు కెరీర్ ను కొనసాగించగలరని, ఎందరినో ప్రభావితం చేయగలరని చెప్పాడు. యూఏఈలో ఈరోజు ప్రారంభమైన ఆసియా కప్ లో రేపు ఇండియా, పాకిస్థాన్ తలపడబోతున్నాయి.

More Telugu News