Chandrababu: బెయిల్ పై విడుదలైన వెంగళరావుకు చంద్రబాబు ఫోన్... వీడియో ఇదిగో!

  • ప్రభుత్వంపై దుష్ప్రచారంతో కూడిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ టీడీపీ కార్యకర్త అరెస్ట్
  • రిమాండ్ కు తిరస్కరించిన కోర్టు
  • సొంత పూచీకత్తుపై వెంగళరావుకు బెయిల్
  • వీరోచితంగా పోరాడావంటూ చంద్రబాబు అభినందన
Chandrababu phone call to Vengalarao

ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సీఐడీ పోలీసుల రిమాండ్ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం, వెంగళరావుకు సొంత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. కాగా, విడుదలైన వెంగళరావుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. 

వీరిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది .....
చంద్రబాబు: ప్రజలను, నీలాంటి వారిని భయభ్రాంతులకు గురిచేసి, తమ అరాచక పాలన కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంత బాధపడినా గానీ, నువ్వు వీరోచితంగా పోరాడావు. నీ వెంట మేమందరం ఉంటాం. ఎలా పోరాడాలో మనమందరం ప్రజలకు సందేశం అందిద్దాం. ధర్మాన్ని కాపాడడమే మన లక్ష్యం... న్యాయమే గెలుస్తుంది.


వెంగళరావు: పోలీసులు నన్ను కొడుతూ మీ పేరు (చంద్రబాబు), లోకేశ్ బాబు పేరు చెబితే వదిలేస్తామన్నారు సర్.

చంద్రబాబు: ఎవర్నంటే వాళ్లని పట్టుకురావడం, వెధన పనులు, దరిద్రపు పనులు చేయడం వాళ్లకు అలవాటైపోయింది. వాళ్లకేమైనా బ్యాడ్జిలు ఉన్నాయా?

 వెంగళరావు:  వాళ్లకేమీ బ్యాడ్జిలు లేవు సర్... కానీ వాళ్లలో ఇద్దరు ముగ్గురు పేర్లు నాకు తెలుసు సర్... నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాళ్ల పేర్లు మీకు చెబుతాను సర్... వాళ్లకు మనం కచ్చితంగా తిరిగి ఇవ్వాలి సర్.

చంద్రబాబు: ఏదేమైనా మనం లాజికల్ గా, లీగల్ గా పోరాడాలి. చట్టాన్ని గౌరవించే బాధ్యతను అందరూ తీసుకోవాలి.

వెంగళరావు: మీరంతా నా వెనుక ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సర్. మీరు ఎంతో బిజీగా ఉండి కూడా నా కోసం శ్రమపడ్డారు సర్. నన్ను బయటికి తీసుకువచ్చేందుకు పార్టీ లీగల్ సెల్ ఎంతో కృషి చేసింది సర్. 
 
చంద్రబాబు: లీగల్ సెల్ మాత్రమే కాదు, ఇలాంటివి జరిగినప్పుడు సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఖండించాలి. బాధితులకు సహకరించాలి. మనం పోరాటం కొనసాగిద్దాం.

వెంగళరావు: థాంక్యూ సర్.

More Telugu News