Rahul Gandhi: కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలంటూ రాహుల్ గాంధీపై ఒత్తిడి తెస్తాం: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge says they will force Rahul Gandhi to take Congress leadership
  • 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం
  • పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా
  • తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా
  • రాహుల్ వైపే చూస్తున్న కొందరు నేతలు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ స్వచ్ఛందంగా వైదొలగడం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు కోరినా మళ్లీ ఏఐసీసీ పగ్గాలు అందుకునేందుకు రాహుల్ ముందుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. 

పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి ఉన్న నేత కాంగ్రెస్ లో లేరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ పగ్గాలు అందుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు.

"కాంగ్రెస్ పార్టీని నడిపించాలని ఎవరైనా భావిస్తుంటే వారు దేశం మొత్తానికి తెలిసిన వ్యక్తి అయివుండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు మద్దతు అందుకోగలిగి ఉండాలి. మంచి గుర్తింపు కలిగి ఉండి, పార్టీలో ఎవరూ అభ్యంతరపెట్టని వ్యక్తి అయివుండాలి. 

కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి స్థాయి ఉన్న నేత రాహుల్ తప్ప మరెవరూ లేరు. కాంగ్రెస్ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలంటూ రాహుల్ ను అడుగుతాం, అర్థిస్తాం, ఒత్తిడి చేస్తాం... ఆర్ఎస్ఎస్-బీజేపీపై పోరాటం సాగించి దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ రావాలని విజ్ఞప్తి చేస్తాం... ఆయన వెనుక మేముంటాం" అని మల్లికార్జున ఖర్గే వివరించారు.
Rahul Gandhi
Mallikarjun Kharge
Congress
Sonia Gandhi

More Telugu News