Jharkhand: హీటు పెంచుతున్న ఝార్ఖండ్ రాజకీయం.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రాంచీ నుంచి తరలిస్తున్న హేమంత్ సోరెన్

  • సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై వేటు పడే అవకాశం
  • ప్రత్యర్థి పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న సోరెన్
  • మధ్యాహ్నం సోరెన్ నివాసం నుంచి బయల్దేరిన ఎమ్మెల్యేలు
Hemant Soren shifts his MLAs

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చంటూ ఈసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అనర్హతపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటే సోరెన్ ఎమ్మెల్యేగా అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో హేమంత్ సోరెన్ ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. 

నిన్న సాయంత్రమే సోరెన్ నివాసం వద్ద రెండు బస్సులు కనిపించాయి. ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలంతా బ్యాగులు సర్దుకుని అక్కడకు వచ్చారు. మధ్యాహ్నం సోరెన్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలంతా రాంచీ నుంచి బస్సుల్లో బయల్దేరారు. వీరిని ఛత్తీస్ గఢ్ లేదా పశ్చిమబెంగాల్ కు తరలించే అవకాశం ఉందని చెపుతున్నారు. 

ఝార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోరెన్ సంకీర్ణ ప్రభుత్వానికి 49 మంది సంఖ్యాబలం ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సోరెన్ కు చెందిన జేఎంఎం పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒకవేళ సోరెన్ పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ బీజేపీ నుంచి వినిపిస్తోంది.  

సీఎంగా ఉంటూనే గనుల లీజును హేమంత్ సోరెన్ తనకు తాను కేటాయించుకున్నారు. ఈ అంశం వివాదాస్పదమయింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ - 9ఏకు ఇది విరుద్ధమంటూ రాజ్ భవన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై నిర్ణయం తీసుకోవచ్చని గవర్నర్ కు ఈసీ తెలిపింది. దీనిపై ఈ రాత్రిలోగా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

More Telugu News