Haryana: ఒకే ఇంట్లో ఆరుగురి ఆత్మహత్య.. ఇద్దరు అధికారులే కారణమంటూ సూసైడ్ నోట్

Six members in family committed suicide in Haryana
  • హర్యానాలోని అంబాలా నగర సమీపంలో ఘటన
  • కుటుంబ సభ్యులకు విషమిచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబ పెద్ద
  • మృతుల్లో ఏడేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు
  • తన కంపెనీలోని ఇద్దరు అధికారులే కారణమంటూ సూసైడ్ నోట్
ఆర్థిక ఒత్తిడి భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని అంబాలా సమీపంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బలన గ్రామస్థుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిన్న వెంటనే సుఖ్విందర్ సింగ్ (34) ఇంటికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి వెంటనే అప్రమత్తమయ్యారు. 

అపస్మారక స్థితిలో పడివున్న సుఖ్విందర్ సింగ్, ఆయన భార్య రీనా (28), కుమార్తెలు ఆషు (5), జెస్సీ (7), సుఖ్విందర్ తండ్రి సంగత్ రామ్ (65), తల్లి మహీంద్రో కౌర్ (60)లను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారంతా చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.

యమునా నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుఖ్విందర్‌ను అదే కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని సమకూర్చలేకపోయినట్టు ఆ లేఖలో సుఖ్విందర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఇద్దరి పేర్లను పేర్కొన్నారు. 

కాగా, సుఖ్విందర్ తాను ఉరి వేసుకోవడానికి ముందు కుటుంబ సభ్యులందరికీ విషం ఇచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను గొంతు నులిమి చంపినట్టు కూడా కనిపిస్తోందని డీఎస్పీ జోగిందర్ సింగ్ అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుఖ్విందర్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Haryana
Ambala
Suicide
Crime News

More Telugu News