TDP: నువ్వు ఎంత తొక్కితే అంతగా లేస్తాం: నారా లోకేశ్

tdp leader nare lokesh strong tweets on ap cid over arrest of tdp activist vengal rao
  • టీడీపీ కార్య‌క‌ర్త వెంగ‌ళ‌రావును అరెస్ట్ చేసిన సీఐడీ
  • విచార‌ణలో ఆయ‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న లోకేశ్
  • వెంగ‌ళ‌రావును ఎందుకు అరెస్ట్ చేశార‌ని ప్ర‌శ్నించిన టీడీపీ నేత‌
  • చట్టాలను అతిక్రమించిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డి
ఏపీలో విప‌క్ష టీడీపీకి చెందిన నేత‌ల‌ను అధికార వైసీపీ సూచ‌న‌ల మేర‌కు సీఐడీ అధికారులు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ కార్య‌కర్త వెంగ‌ళ‌రావును అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు ఆయ‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని, ఆ హ‌క్కు సీఐడీ అధికారుల‌కు ఎవ‌రు ఇచ్చార‌ని ఆయన నిల‌దీశారు. ఈ మేర‌కు సీఐడీ అధికారుల విచార‌ణ అనంత‌రం ఇద్ద‌రు వ్యక్తుల స‌హాయంతో అతి క‌ష్టం మీద చిన్న‌గా న‌డుస్తున్న వెంగ‌ళ‌రావు వీడియోను పోస్ట్ చేస్తూ లోకేశ్ నేడు లోకేశ్ వ‌రుస ట్వీట్లు సంధించారు.

ఈ ట్వీట్ల‌లో వైసీపీ, సీఐడీ, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌ను ఉద్దేశిస్తూ లోకేశ్ పలు వ్యాఖ్య‌లు చేశారు. సీఐడీ వైసీపీకి అనుబంధ విభాగంగా మారిపోయింద‌ని ఆయ‌న ఆరోపించారు. సీఎం జగన్ మూర్ఖత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు పనిచెయ్యడం దారుణమ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ కార్యకర్త వెంగళరావు చేసిన తప్పేంటని ప్ర‌శ్నించిన లోకేశ్.. వెంగళరావును అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిల‌దీశారు.

ఎవరి ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ప్ర‌శ్నించిన లోకేశ్... సీఎం జగన్ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ టీడీపీలో లేరని తెలిపారు. అరెస్ట్ చేసి కొడితే ప్రశ్నించడం తగ్గుతుంది అని జ‌గ‌న్ భ్రమపడుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. నువ్వు ఎంత తొక్కితే అంతగా లేస్తామ‌ని చెప్పిన లోకేశ్.. మున్ముందు అన్ని లెక్కలు తేలుస్తామ‌ని హెచ్చ‌రించారు. వెంగళరావుని తక్షణమే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసిన లోకేశ్.. చట్టాలను అతిక్రమించి వ్యవహరించిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తామ‌ని తెలిపారు.
TDP
Nara Lokesh
YSRCP
YS Jagan
AP CID

More Telugu News