Arvind Kejriwal: ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ: కేజ్రీవాల్

Kejriwal calls BJP as serial killer of governments
  • తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు యత్నించారన్న కేజ్రీ 
  • తమ ఎమ్మెల్యేలు వజ్రాలు.. వారిని ఎవరూ కొనలేరని కితాబు 
  • మనీశ్ సిసోడియా ఇంట్లో పావలాను కూడా పట్టుకోలేకపోయారని ఎద్దేవా 
బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బీజేపీ అని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు ప్రయత్నించిందని... అయితే, తమ ఎమ్మెల్యేలు ఎవరూ వారి బుట్టలో పడలేదని అన్నారు. 

తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తానని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఇరికించేందుకు సీబీఐ ఎంతో ప్రయత్నించిందని... ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో ఒక్క పావలాను కూడా పట్టుకోలేకపోయారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీశ్ ని ఒక బీజేపీ నేత సంప్రదించారని... ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని... సీఎం పదవిని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీశ్ ఈ ఆఫర్ ను తిరస్కరించారని... దీంతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరూ వజ్రాలని... వారిని ఎవరూ కొనలేరని అన్నారు.
Arvind Kejriwal
AAP
BJP

More Telugu News