Himanta Biswa Sharma: కొన్నాళ్లు పోతే కాంగ్రెస్ లో గాంధీలు మాత్రమే మిగులుతారు: అసోం సీఎం హిమంత శర్మ

  • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన గులాంనబీ ఆజాద్
  • రాహుల్ ను విమర్శిస్తూ లేఖ
  • 2015లో తాను కూడా ఇలాంటి లేఖ రాశానన్న అసోం సీఎం
  • అప్పట్లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన శర్మ
Assam CM Himanta Biswa Sharma comments on Gulan Nabi Azad resignation from Congress

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునేది రాహుల్ గాంధీ, ఆయన బాడీగార్డులేనంటూ ఆజాద్ తన లేఖలో తీవ్ర విమర్శలు చేయడం మరింత కలకలం రేపింది. దీనిపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. మున్ముందు ఇలాంటివి చాలా జరుగుతాయని, కొన్నాళ్లు పోతే కాంగ్రెస్ పార్టీలో మిగిలేది గాంధీలేనని ఎద్దేవా చేశారు. 

హిమంత బిశ్వ శర్మ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2015లో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అప్పట్లో హిమంత బిశ్వ శర్మ కూడా ఆజాద్ తరహాలోనే రాహుల్ పై ఘాటైన విమర్శలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజీనామా లేఖ పంపారు. తాజాగా, ఆజాద్ రాజీనామాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

"ఇప్పుడు గులాం నబీ ఆజాద్ రాసిన లేఖ చదవండి, 2015లో నేను రాసిన లేఖ చదవండి. రెండింటికి ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. రాహుల్ గాంధీలో పరిణతి లేకపోవడమే కాంగ్రెస్ పార్టీలో సమస్యగా మారింది. అతడొక విచిత్రమైన వ్యక్తి. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనండి లేకపోతే సోనియా గాంధీ అనండి.... ఆమె కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవడంలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆమె చేస్తున్నదల్లా తన కుమారుడ్ని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడమే. 

కానీ అదొక విఫలయత్నం. దాని ఫలితమే, వారిని విడిచి పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. కేవలం గాంధీలే కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయే రోజు వస్తుందని ఎప్పుడో ఊహించాను. అది ఇప్పుడు జరుగుతోంది. వాస్తవానికి రాహుల్ గాంధీ బీజేపీకి వరం లాంటివాడు. కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు ఈ భావనతోనే ఉన్నారు. ఓ పెద్ద పార్టీని నడిపించే సత్తా రాహుల్ గాంధీకి లేదని వారందరూ నమ్ముతున్నారు" అని హిమంత బిశ్వ శర్మ వివరించారు.

More Telugu News