Jammu And Kashmir: యూరి సెక్టార్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం.. వీడియోను షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ

Chilling video captures infiltration bid by Pakistani terrorists in Uri sector
  • సీసీ కెమెరాల్లో రికార్డయిన చొరబాటు యత్నం
  • సైన్యం కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
  • రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనా మేడ్ తుపాకి లభ్యం
ఏదో రకంగా భారత్‌లో ప్రవేశించి అలజడి సృష్టించాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉంది. రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదుల్లో ఒకరిని ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకుంది. మరో ఇద్దరు మందుపాతర పేలుడులో మరణించారు. తాజాగా, యూరి సెక్టార్‌లోనూ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ షేర్ చేసింది. 

యూరి సెక్టార్‌ కామల్‌కోట్ ప్రాంతంలోని మేడియన్ నానక్ సమీపంలో ముగ్గురు ఉగ్రవాదులు నిన్న చొరబాటుకు యత్నించారు. ఈ చొరబాటు యత్నం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వారి కదలికలను గుర్తించిన భారత సైన్యం ఉగ్రవాదులపై తూటాల వర్షం కురిపించి హతమార్చి కుట్రను భగ్నం చేసింది. ఆ ప్రాంతంలోని దట్టమైన పొదలు, మరీ కిందగా ఉండే దట్టమైన మేఘాలను అడ్డంపెట్టుకుని ఉగ్రవాదులు చొరబాటు యత్నాలు చేస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. 

నిన్న ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని, రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనీస్ తయారీ ఎం-16 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
Jammu And Kashmir
Uri Sector
LoC
Pakistan
Terrorists

More Telugu News