YSRCP: టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌రి తెగించారు... కుప్పం ఘ‌ర్ష‌ణ‌ల‌పై స‌జ్జ‌ల ఆగ్ర‌హం

sajjala ramakrishnareddy fires on kuppam clashes
  • జగన్‌  పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్న స‌జ్జ‌ల‌
  • కుప్పం ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదని ఆరోప‌ణ‌
  • అన్నా క్యాంటీన్లు 2014లో ఎందుకు గుర్తు రాలేద‌ని ప్ర‌శ్న‌
  • చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసే ప‌నిచేస్తున్నార‌ని అంద‌రికీ తెలుస‌న్న వైసీపీ నేత‌
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా గ‌డ‌చిన రెండు రోజులుగా అక్క‌డ జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు సజ్జ‌ల రామకృష్ణారెడ్డి గురువారం స్పందించారు. 

కుప్పంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారని ఆయ‌న‌ మండిపడ్డారు. విధ్వంసకర ఘటనకు టీడీపీ తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పాలనలో కుప్పం ప్రజలు అభివృద్ధిని చూశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ కకావికలమైందన్నారు. కుప్పం ప్రజల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదన్నారు. చంద్రబాబు సేవ చేస్తే ప్రజలు ఆయన గురించి ఆలోచిస్తారని సజ్జల అన్నారు.

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని స‌జ్జ‌ల ఆరోపించారు. ముందు నుంచే ఉన్న వైసీపీ జెండాలను టీడీపీ శ్రేణులు తొల‌గించాయ‌న్న స‌జ్జ‌ల‌... మా చంద్రబాబు వస్తుంటే వైసీపీ జెండాలు పెడతారా? అంటూ దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబే ప్రథమ ముద్దాయి అని ఆయ‌న అన్నారు.

గ‌డ‌చిన రెండు రోజులుగా అదే పనిగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతూనే ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగేలా వ్యవహరించారన్న స‌జ్జ‌ల‌.. గతంలో కూడా టీడీపీ నేత‌లు ఇలాగే చేశారని ధ్వ‌జ‌మెత్తారు. డిప్రెషన్‌తో చంద్రబాబు బాధ పడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

జనాన్ని చంద్రబాబే స్వయంగా రెచ్చగొట్టి, దాడులకు ఉసిగొల్పారని స‌జ్జ‌ల ఆరోపించారు. కుప్పంలో 30 ఏళ్లుగా చంద్ర‌బాబు దొంగ ఓట్లతో గెలిస్తూ వచ్చారన్న ఆయ‌న‌.. వాటన్నిటికీ ఇప్పుడు వైసీపీ దెబ్బతో బ్రేక్ పడిందన్నా‌రు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి కుప్పం నియోజకవర్గాన్ని వైసీపీ బయటకు తెచ్చిందన్నారు. చంద్రబాబు వైఖరితో విసుగు చెందిన కుప్పం ప్రజలు ఆయనకు చెల్లుచీటి ఇచ్చార‌ని స‌జ్జ‌ల చెప్పారు. టీడీపీ జెండాలు కట్టుకోవచ్చు. కానీ వైసీపీ జెండాలు పీకటం ఎందుకు? అని సజ్జల ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్ పేరుతో టీడీపీ శ్రేణులు రచ్చ చేశాయ‌న్న స‌జ్జ‌ల‌..  గంటకుపైగా చంద్ర‌బాబు రోడ్డుపైన కూర్చుని షో చేశార‌ని ఆరోపించారు. 

టీడీపీకి ఏపీలో 60 లక్షలమంది కార్యకర్తలు ఉండేంత సీన్ లేదని స‌జ్జ‌ల అన్నారు. చంద్రబాబు, జ‌న‌సేనాని పవన్ క‌ల్యాణ్‌ మ‌ధ్య‌ రహస్య బంధం ఎందుకో తెలియ‌డం లేద‌న్నారు. వారిద్దరూ కలిసే పని చేస్తున్నారని అందరికీ తెలుసున‌ని కూడా ఆయ‌న చెప్పారు. వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని పవన్ అంటున్నారన్న స‌జ్జ‌ల‌.. ఈ లెక్క‌న ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ తొలగించాలని పవన్ కోరుకుంటున్నట్లే క‌దా? అని అన్నారు. 

జగన్ అంటేనే సంక్షేమం గుర్తొస్తుందన్న స‌జ్జ‌ల‌.. ఆ సంక్షేమాన్ని ప్రజలకు అందకుండా చేయాలన్న లక్ష్యంతో పవన్, చంద్రబాబు పని చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. పేద ప్రజల కడుపు నింపాలనుకుంటే 2014లోనే అన్నా క్యాంటీన్లు ఎందుకు పెట్టలేదు? అని ప్ర‌శ్నించిన స‌జ్జ‌ల‌.. 2019 ఎన్నికలకు ముందే అవి ఎందుకు గుర్తొచ్చాయి? అని నిల‌దీశారు.
YSRCP
Sajjala Ramakrishna Reddy
Kuppam
TDP
Chandrababu
Pawan Kalyan
Janasena

More Telugu News