AAP: పార్టీ నాయకత్వానికి అందుబాటులోకి రాని పలువురు ‘ఆప్​’ ఎమ్మెల్యేలు

Some MLAs unreachable AAP to hold key meet today amid poaching fears
  • ఢిల్లీలో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్
  • తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న ఆప్
  • నిన్న కేజ్రీవాల్‌ అధ్యక్షతన సమావేశమైన ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ
తమ శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ఉదయం ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు అందుబాటులోకి రాకపోవడంతో ఆప్ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. పార్టీ మారేందుకు బీజేపీ తమకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని గతంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. 

బుధవారం ఆప్ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధ్యక్షతన ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆప్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల నగదు అందించి పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. 

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే ఆయనపై సీబీఐ దాడులకు ఆదేశించడాన్ని కమిటీ గుర్తించిందని ఆప్ పీఏసీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. సిసోడియాపై పీఏసీ తన విశ్వాసాన్ని వ్యక్తం చేసిందన్నారు. 

పీఏసీ సమావేశం అనంతరం సంజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘డబ్బులు ఇచ్చి, గూండాయిజానికి పాల్పడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చివేసే చర్యలను మేం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసి, రాజకీయ నేతలపైకి సీబీఐ, ఈడీలను పంపే బదులు ప్రజల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు నేడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండింటితో బాధపడుతున్నారు. మీరే ప్రజా ప్రభుత్వాలను అస్థిరపరచడానికి మీ సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అంత డబ్బు ఎలా పోగుపడిందో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది’ అని చెప్పారు.
AAP
Arvind Kejriwal
delhi
MLA

More Telugu News