ఈరోజు వరంగల్ లో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై.. భారీ భద్రత ఏర్పాటు!

  • కాకతీయ యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న తమిళిసై
  • రోడ్డు మార్గంలో వరంగల్ కు బయల్దేరిన గవర్నర్
  • యూనివర్శిటీ వద్ద పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
టీఆర్ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ తో ఓ వైపు రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇదే సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై వరంగల్ పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజు ఆమె వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీకి కాసేపట్లో చేరుకోనున్నారు. యూనివర్శిటీలో జరిగే 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొంటారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేయనున్నారు. మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. 

గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు బయల్దేరారు. కార్యక్రమం అనంతరం కూడా రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటనకు పోలీసులు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ యూనివర్శిటీలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్నాతకోత్సవం జరిగే ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.

Tamilisai Soundararajan
Telangana
Warangal
Kakatiya University

More Telugu News