Monkeypox Virus: మంకీపాక్స్ చికిత్సకు వాడే ఔషధం విషయంలో క్లినికల్ ట్రయల్ మొదలు

  • టెకోవిరిమాట్ డ్రగ్ పై  ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పరీక్షల నిర్వహణ
  • 500 మంది వాలంటీర్లపై 14 రోజుల ప్రయోగం
  • 80 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్
Clinical trial of Tecovirimat drug to treat monkeypox begins at Oxford

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మంకీ పాక్స్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ని నయం చేసేందుకు వాడే మందును పరీక్షించడానికి ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ‘టెకోవిరిమాట్’ అనే డ్రగ్ మంకీ పాక్స్ పై పోరాడుతుందని భావిస్తున్నారు. 

టెకోవిరిమాట్ ను ప్రారంభంలో మశూచిని నయం చేసేందుకు అభివృద్ధి చేశారు. ఇది వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు శరీరంలో దాని వ్యాప్తిని ఆపుతుంది. జంతువులపై ప్రాథమిక అధ్యయనాలు మంచి ఫలితాలను చూపించిన తర్వాత మంకీపాక్స్ కోసం దీన్ని వినియోగించేందుకు ఔషధాలు మరియు ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ నుంచి దీనికి లైసెన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మనుషులపై ప్రయోగించేందుకు ఆక్సఫర్డ్ లో పరీక్షలు మొదలయ్యాయి. 


ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సర్ పీటర్ హోర్బీ నాయకత్వంలో జరిగే ఈ ప్రయోగానికి ‘ప్లాటినం’ అని నామకరణం చేశారు. దీని కోసం బ్రిటన్ ప్రభుత్వం 3.7-మిలియన్ పౌండ్ల నిధులు మంజూరు చేసింది.  ఈ డ్రగ్ ను కనీసం 500 మంది వాలంటీర్లపై ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 రోజుల కోర్సులో వారికి రోజుకు రెండుసార్లు 600 ఎంజీ టెకోవిరిమాట్ ఇస్తారు. 

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా 40 వేల పైచిలుకు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల చాలా మంది మరణించారు. మొత్తం 80 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. భారత్ లో ఇప్పటిదాకా పది కేసులు నమోదయ్యాయి.

More Telugu News