Vijay Devarakonda: ‘లైగర్’ కోసం విజయ్ పారితోషికం ఎంతంటే..!

  • ఇంతకుముందు రూ. 6-7 కోట్లు తీసుకున్న విజయ్  
  • ఇప్పుడు ‘లైగర్’ కోసం రూ. 25 కోట్ల పారితోషికం
  • భారీ హిట్ అయితే లాభాల్లో వాటా కూడా 
  • రేపు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న ‘లైగర్’
Vijay Deverakonda charged Rs 25 crore fee for Liger

‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. గురువారం విడుదలయ్యే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్లలో దేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు విజయ్ కి బ్రహ్మరథం పట్టారు. అన్ని రాష్ట్రాల్లో విజయ్ కి అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ స్టార్లకు తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు విజయ్ సొంతమైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం  తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’తో హీరోగా మారేముందు విజయ్ పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘గీత గోవిందం’, ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘లైగర్’ ముందు వరకు విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్లు పారితోషికంగా తీసుకునేవాడని అంటారు. 

అయితే ఇప్పుడు ‘లైగర్’ కోసం విజయ్ ఏకంగా 20-25 కోట్లు తీసుకున్నాడట. ‘లైగర్’ బడ్జెట్ దాదాపు రూ. 90 కోట్లు కాగా ఇందులో మెజారిటీ వంతు విజయ్ పారితోషికం అని తెలుస్తోంది. ‘లైగర్’ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ దేవరకొండ తన పారితోషికాన్ని మరింత పెంచుకోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చిత్రం ‘ఆర్ఆర్ ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్2’ స్థాయిలో హిట్ అయితే చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ తో కలిసి విజయ్ లాభాల్లో వాటా కూడా పంచుకునే అవకాశం ఉంది. 

విజయ్, హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాను 40 రోజుల పాటు ప్రమోట్ చేశారు. దేశవ్యాప్తంగా  పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ కంటెంట్ సగటు కంటే ఎక్కువ ఉంటే ఇది పెద్ద హిట్ కాబోతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాల అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాది అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ‘లైగర్’ ఒకటి. కంటెంట్ బాగుంటే ఇది అతనికి అద్భుతమైన చిత్రం కావచ్చు. కమర్షియల్‌గా ‘లైగర్’ బాగా రాణిస్తే, విజయ్ కి ఇక తిరుగుండదు. బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయిపోతాడు’ అని పేర్కొన్నారు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్మాణ దర్శకత్వంలో ‘ఖుషీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే పూరితో ‘జన గణ మన’ సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News