Chandrababu: నేడు కుప్పం వెళ్తున్న చంద్రబాబు.. మూడు రోజులు అక్కడే మకాం!

Chandrababu to stay in Kuppam for 3 days
  • నేతలు, బూత్ ఇన్ఛార్జీల పని తీరుపై సమీక్ష నిర్వహించనున్న టీడీపీ అధినేత 
  • ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయనున్న బాబు
  • నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈరోజు కుప్పంకు వెళ్లనున్న ఆయన... మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన క్లస్టర్, యూనిట్ క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. వారి పని తీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతే కాదు పార్టీ సభ్యత్వ నమోదును కూడా సమీక్షించనున్నారు. సభ్యత్వ నమోదులో కుప్పం రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న సంగతి గమనార్హం. 

ముఖ్యంగా ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను చంద్రబాబు అప్రమత్తం చేయబోతున్నారు. అధికార పార్టీ నేతలు ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓటు నమోదు చేయించే అవకాశం ఉందనే అనుమానాలతో... పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేయబోతున్నట్టు సమాచారం. కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా... ప్రతి క్లస్టర్ కు 45 నిమిషాల సమయాన్ని చంద్రబాబు కేటాయించనున్నారు. 

రేపు మధ్యాహ్నం ఆయన అన్ని క్లస్టర్లలోని 50 మంది ప్రధాన నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే కుప్పం - పలమనేరు హైవే పక్కన నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. వీరిపై పార్టీ కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. నియోజకవర్గ పరిస్థితిని వ్యక్తిగతంగా తానే పర్యవేక్షిస్తానని... ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. చెప్పిన విధంగానే గత 8 నెలల్లో ఆయన కుప్పంకు వెళ్తుండటం ఇది మూడో సారి కావడం గమనార్హం.
Chandrababu
Telugudesam
Kuppam

More Telugu News