విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు.. చితకబాదిన తల్లిదండ్రులు
- ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం జడ్పీ పాఠశాలలో ఘటన
- హెచ్ఎం కారులో స్కూలుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు
- చితకబాది సర్పంచ్ వద్దకు తీసుకెళ్లిన గ్రామస్థులు
- డిప్యుటేషన్‌పై వెళ్తానంటే శాంతించిన వైనం
- విచారణకు ఆదేశించిన డీఈవో
రామారావు నిన్న కారులో స్కూలుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్థులు ఆయనను కిందికి లాగి చితకబాదారు. సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి హెచ్ఎంను ఎలాగోలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు అక్కడికి కూడా చేరుకున్నారు.
రామారావు గ్రామంలో పనిచేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్తానని, లేదంటే సెలవులో ఉంటానని రామారావు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు గొల్లపూడి ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తూ డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు.