Artificial Diamonds: భారత్ లో తయారయ్యే కృత్రిమ వజ్రాలకు అమెరికాలో విపరీతమైన గిరాకీ

  • భారత్ లో అభివృద్ధి చెందుతున్న కృత్రిమ వజ్రాల పరిశ్రమ
  • అమెరికాకు ఎగుమతులు రెట్టింపయ్యే అవకాశం
  • బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ డిమాండ్
Indian made artificial diamonds gets huge demand in US and other markets

భారత్ లో వజ్రాలకు సానబట్టే పరిశ్రమే కాదు, కృత్రిమ వజ్రాల ఉత్పత్తి పరిశ్రమ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. భారత్ లో ప్రయోగశాలల్లో తయారయ్యే కృత్రిమ వజ్రాలకు అమెరికాలో విపరీతమైన గిరాకీ నెలకొంది. ఇతర దేశాల మార్కెట్లలోనూ ఈ తరహా వజ్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన తాజా ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా, పాలిష్ చేసిన కృత్రిమ వజ్రాల ఎగుమతులు రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.03 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. 

దీనిపై జెమ్ అండ్ జ్యూయెలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ విపుల్ షా స్పందిస్తూ, కృత్రిమ వజ్రాల మార్కెట్ ను మరింత అభివృద్ధి చేసే సామర్థ్యం తమకుందని, అమెరికాతో పాటు, బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ కృత్రిమ వజ్రాలను అనుమతిస్తున్న నేపథ్యంలో మరికొన్నేళ్లలో వీటి మార్కెట్ విలువ రూ.5.59 లక్షల కోట్ల నుంచి రూ.6.39 లక్షల కోట్లకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. యువతలో ఇదొక ఫ్యాషన్ జ్యుయెలరీగా గుర్తింపు పొందుతోందని, ఈ నేపథ్యంలో కృత్రిమ వజ్రాల మార్కెట్ భారత్ వెలుపల కూడా విస్తరిస్తోందని వెల్లడించారు. 

ప్రయోగశాలలో వజ్రాన్ని ఎలా తయారుచేస్తారంటే... కార్బన్ మూల ధాతువును ఓ మైక్రోవేవ్ చాంబర్ లో ఉంచి అత్యంత తీవ్ర ఉష్ణోగ్రతకు గురిచేస్తారు. అప్పుడది మెరిసే ప్లాస్మా బంతిలా తయారవుతుంది. కొన్నివారాల పాటు జరిగే ఈ ప్రక్రియల అనంతరం అణువులు స్ఫటికాలు, ఆపై వజ్రాలుగా రూపాంతరం చెందుతాయి.

More Telugu News