KCR: దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెడుతున్నారు.. మేధావులు మౌనంగా ఉండకూడదు: సీఎం కేసీఆర్​

The country is being pushed into a state of frenzy Intellectuals should not remain silent says CM KCR
  • స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పేదల ఆశలు నెరవేరలేదన్న కేసీఆర్
  • అనేక వర్గాలు ఇంకా ఆవేదనలోనే ఉన్నాయని వ్యాఖ్య
  • దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదన్న తెలంగాణ సీఎం
దేశంలో ఇప్పటికీ పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయని.. అట్టడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం వినిపిస్తూనే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అనేక వర్గాల ప్రజలు తమకు స్వాతంత్ర్యం ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారి బాధను పక్కన పెట్టేసి.. దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా తెలిసి కూడా ఏమీ అర్థంకానట్టు ప్రవర్తించడం, మౌనంగా ఉండటం మేధావుల లక్షణం కాదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

గాంధీజీ గురించి ఇప్పటి తరానికి తెలియాలి
అనుకున్న విధంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొన్నామని కేసీఆర్ చెప్పారు. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా ఓడించవచ్చని నిరూపించిన మహాత్మా గాంధీ పుట్టినగడ్డ మన దేశమని.. అటువంటి దేశంలో గాంధీ గురించి, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర గురించి ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నో అమూల్యమైన త్యాగాలు, బలిదానాలు జరిగితేనే స్వాతంత్ర్యం వచ్చిందని.. ఇలాంటి సమయంలో దేశంలో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ముందుకు సాగాల్సి ఉందని సూచించారు. 

దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదు
అద్భుతమైన వనరులు ఉన్న భారత దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదని.. ఈ విషయాన్ని యువత గుర్తించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తామో.. ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుందని చెప్పారు. స్వాతంత్ర్య స్ఫూర్తితో కులం, మతం, జాతి, పేద, ధనిక భేదాలు లేకుండా.. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని పేర్కొన్నారు.
KCR
India
TRS
Hyderabad
Telangana

More Telugu News