Bandi Sanjay: మా కుటుంబ పెద్ద వంటి కేంద్ర హోంమంత్రికి నేను చెప్పులందించడం గులామ్ గిరీయా?: బండి సంజయ్

Bandi Sanjay replies to KTR tweet
  • ఢిల్లీలో చెప్పులు మోసే గులాములు అంటూ కేటీఆర్ ట్వీట్
  • పెద్దవాళ్లకు చెప్పులు అందించడం సంస్కారం అని వెల్లడి
  • ఆ సంస్కారం మీకేం అర్థమవుతుంది అంటూ ధ్వజం
తెలంగాణ అధికార పక్షం టీఆర్ఎస్ కు, రాష్ట్ర బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం కేసీఆర్ తనయ కవితకు ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ఢిల్లీలో చెప్పులు మోసే గులాములను తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబ సభ్యుల రహస్యాలు బయటపడకుండా తంటాలు పడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ ను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటూ బండి సంజయ్ దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం, అవసరం లేకుంటే కాళ్లు పట్టి గుంజడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

"కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? మీరు సాష్టాంగ దండప్రమాణం చేసినప్పుడు బెంగాల్ కు, తమిళనాడుకు గులాములు అయ్యారా? ఇప్పుడు పాదరక్షలు అందిస్తే గుజరాత్ కు గులాము అయినట్టా? 

కేసీఆర్ లాగా అవసరాన్ని బట్టి పొర్లుదండాలు పెట్టడం మా రక్తంలో లేదు. అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబ సభ్యులకు పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థమవుతుంది? రామ, భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం. తండ్రిని బంధించి, అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు మా సంస్కృతి ఏం అర్థమవుతుంది?" అంటూ ధ్వజమెత్తారు. 

"మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం. మీలాగా అవసరాలు తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం గులామ్ లం కాదు.. మీలాగా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు" అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.
Bandi Sanjay
KTR
Gulamgiri
BJP
TRS
Telangana

More Telugu News