Belgian shepherd Dogs: పండు కోసం చెట్టెక్కి.. గాల్లో ఎగిరి దూకుతూ శునకాల హడావుడి.. వైరల్ వీడియో ఇదిగో!

Belgian shepherd Dogs climbing tree and snatching fruit
  • వేగంగా పరుగెడుతూ ఎత్తయిన చెట్టుపై దాకా ఎక్కిన శునకాలు
  • అదే వేగంతో గాల్లోకి ఎగురుతూ పండును అందుకునే ప్రయత్నం
  • ఇంటర్ నెట్ లో విపరీతంగా వైరల్ అయిన వీడియో
  • ‘ఎవరో ప్రొఫెషనల్ అథ్లెట్లలా ఉన్నాయి’ అంటూ కామెంట్లు
శునకాలు సరదాగా ఆటలాడుతుండడం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. ఏదైనా వస్తువుల కోసం కుక్కలతోపాటు పిల్లుల వంటి ఇతర జంతువులు అటూ ఇటూ దూకుతుండటం చూస్తుంటాం. కానీ చెట్టు మీద ఉన్న పండును అందుకోవడానికి రెండు బెల్జియం శునకాలు చేసిన ఫీట్లు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. అంత ఎత్తున ఉన్న పండును అందుకోవడానికి వేగంగా పరుగెడుతూ కాండం మీద నుంచి చెట్టు పైదాకా వెళ్లి అక్కడి నుంచి అలాగే గాల్లోకి ఎగురుతూ.. పండును అందుకోవడానికి అవి చేసిన ప్రయత్నాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అంత ఎత్తున పండును అందుకునేందుకు..
ఓ పెద్ద చెట్టుకు పసుపు రంగులో ఉండే పండుపై రెండు బెల్జియం షెపర్డ్ జాతికి చెందిన శునకాల కన్ను పడింది. దాన్ని అందుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వేగంగా పరుగెడుతూ చెట్టు కాండంపై పైదాకా చేరుకుని.. అక్కడి నుంచి గాల్లోకి ఎగిరి పండు అందుకునేందుకు ప్రయత్నిస్తూ కిందికి దూకడం మొదలుపెట్టాయి. ఒకదాని వెనుక మరో శునకం ప్రయత్నించగా.. వాటిలోని ఓ శునకం పండును అందుకుని కిందికి దూకగలిగింది. వెంటనే మరో శునకం దాని దగ్గరికి చేరింది. రెండూ ఆ పండును లాక్కుంటూ పొలాల్లోకి పరుగెత్తాయి.

30 లక్షలకుపైగా వ్యూస్ తో..
మొరిస్సా ష్వార్జ్ అనే పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇవి మంచి క్రీడాకారులు (అథ్లెట్లు)’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో నిడివి కేవలం 11 సెకన్లే ఉన్నా.. విపరీతంగా వైరల్ గా మారింది. ఇప్పటివరకు 30 లక్షల మందికిపైగా దీన్ని వీక్షించారు. వేలకొద్దీ లైక్ లు, షేర్లు వస్తున్నాయి.

‘శునకాలు కాదు ప్రొఫెషనల్ అథ్లెట్లలా ఉన్నాయి’ అంటూ కొందరు.. ‘అసలు అవి కుక్కల్లా లేవు. ఏవో చిరుతపులులు చెట్టెక్కి అందుకుంటున్నట్టుగా ఉంది’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Belgian shepherd Dogs
Dogs
Viral Videos
Offbeat
Fruit

More Telugu News