market crash: ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు.. వీటి వెనుక కొన్ని కారణాలు

  • సోమవారం కూడా కొనసాగిన అమ్మకాలు
  • సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా నష్టం
  • డాలర్ ఇండెక్స్ బలోపేతం, పెరిగిన బాండ్ ఈల్డ్స్
reasons behind todays market crash

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా అమ్మకాలను చవిచూస్తున్నాయి. గత శుక్రవారం కూడా మార్కెట్లు నష్టపోవడం తెలిసిందే. సూచీల్లోని ప్రైవేటు బ్యాంకులు, బ్లూచిప్ ఐటీ కంపెనీలు, ఆటో స్టాక్స్ ఎక్కువ నష్టాలను చూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 664 పాయింట్లు నష్టపోయి 58,982 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 17,552 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  

డాలర్ బలోపేతం
డాలర్ ఇండెక్స్ బలపడడం, జులై మధ్య నాటికి ఉన్న గరిష్ఠ స్థాయికి తిరిగి చేరుకోవడం స్టాక్స్ సెంటిమెంట్ పై ప్రభావం పడేలా చేసింది. యూరోపియన్, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరగడంతో డాలర్ల కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో డాలర్ ఇండెక్స్ 108 పైకి చేరింది. 

బాండ్ ఈల్డ్స్
యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆగస్ట్ 1న 2.588గా ఉంటే, అది తాజాగా 2.983కు పెరిగింది. డాలర్ ఇండెక్స్ తిరిగి 108 పైకి చేరిందని, యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 2.99 శాతానికి చేరుకోవడం వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహానికి ప్రతికూలమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. 

జాక్సన్ హోల్ సింపోజియం
ఈ నెల 25 నుంచి 27 వరకు జాక్సన్ హోల్ సింపోజియం జరగనుంది. ఇది యూఎస్ ఫెడ్ నిర్వహించే భేటీ. ఇందులో విధానాలపై చర్చ జరగనుంది. దీనికంటే ముందే ఫెడ్ సభ్యులు కఠిన స్వరం వినిపిస్తుండడం డాలర్ ఇండెక్స్ బలపడడానికి దారితీసింది. 

ఎఫ్ అండ్ వో ముగింపు
ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టుల ఎక్స్ పైరీ ఈ నెల 25న ముగియనుంది. ఇది కూడా మార్కెట్లలో అస్థిరతలు పెరిగేందుకు కారణమైంది. 

ఆర్ బీఐ మినిట్స్
ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ సమీక్ష సందర్భంగా జరిగిన అంతర్గత చర్చల వివరాలు బయటకు వచ్చాయి. ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిలో ఉందని, దీన్ని కట్టడి చేయాలన్నది ఆర్బీఐ అభిమతంగా ఉంది. దీంతో రానున్న సమీక్షల్లోనూ రేట్ల పెంపు కొనసాగనుందన్న సంకేతం మార్కెట్ కు వెళ్లింది.

More Telugu News